Mathu Vadalara Review
ఆసక్తికరమైన కథ, కథనాలతో ప్రేక్షకుడిని రెండు గంటల పాటు ఎంగేజ్ చేసేలాసినిమాలు రూపొందిస్తే చాలు... ఆ సినిమా విజయం పక్కా. ఏడాదికి తెలుగులో నూట యాభైకి పైగా సినిమాలు వస్తున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ముప్పై, నలబై పోయినా మిగిలినవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే. డిఫరెంట్ జోనర్ చిత్రాలు ప్రేక్షకుడిని మెప్పించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో అలా వచ్చిన ఓ లో బడ్జెట్ మూవీ `మత్తు వదలరా`. ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుల్లో శ్రీసింహ హీరోగా పరిచయమైతే.. కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
ఓ ఆన్‌లైన్ సంస్థలో బాబు(శ్రీసింహ), యేసు(సత్య) డోర్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. వీరితో పాటు రూమ్‌లో అభి(నరేష్ అగస్త్య) అనే స్నేహితుడు ఉంటాడు. ఇతడు ఇంటర్నెట్‌లో సినిమాలు చూస్తూ ఉంటాడు. చాలీ చాలని జీతాలతో వీరు జీవితాలను వెల్లదీస్తుంటారు. అసలు ఇలాంటి ఉద్యోగం చేయకూడదనుకున్న బాబు ఉద్యోగం మానేయాలనుకుంటాడు. ఆ సయంలో యేసు డోర్ డెలివరీ సమయంలో కస్టమర్స్ దగ్గర, వాళ్లకి తెలియకుండా డబ్బులు ఎలా కొట్టేయాలో అనే టెక్నిక్‌ని బాబుకి చెబుతాడు. మరుసటి రోజు ఓ పెద్ద అపార్ట్‌మెంట్స్‌లోకి డెలివరీ చేయడానికి వెళతాడు. అక్కడ ఓ ముసలావిడను మోసం చేయబోయి చిక్కిపోతాడు. ఆ సమయంలో అనుకోండా జరిగిన ప్రమాదం వల్ల ఆమె చనిపోతుంది. ఆ ప్రమాదం నుండి తప్పించుకోడానికి బాబు కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న బాబు కళ్లు తిరిగి పడిపోతాడు. నిద్ర లేచి చూసేసరికి తన పక్కన ఓ శవం ఉంటుంది. ఇంతకు ఆ శవం ఎవరిది? ఎవరు హత్య చేశారు? బాబును ఆ హత్యలో ఎందుకు ఇరికించాలని అనుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
సమీక్ష:
సినిమాలో బడ్జెట్ పరంగా తేడాలుంటాయేమో కానీ.. కథ, కథనం ప్రకారం సినిమాను ఎంత ఆసక్తికరంగా మలిచారనే విషయాల్లో ఎక్కడా తేడా రాదు. సీనియర్ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ ఎవరైనా కానీ సినిమాను ఎలా తెరకెక్కించారు. సినిమా ఆసక్తికరంగా ఉందా? అని సగటు ప్రేక్షకుడు చూస్తాడు. ఆ కోణంలో దర్శకుడు రితేష్ రానా సక్సెస్ సాధించాడు. సినిమా టైటిల్ కార్డ్ నుండి ఎండ్ కార్డ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాను సాగేలా చూసుకున్నాడు. పాత్రలు, వాటి తీరు తెన్నులు, డైలాగ్స్, సన్నివేశాలు ఆసక్తికంగా ఉంటూనే వాటిలో కామెడి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సందర్భానుసారం వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. కమెడియన్ సత్య కామెడి ట్రాక్ చాలా బావుంది. ఇది వరకు తను నటించిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ , అందులో కామెడీ ఉంది. ఇక హీరో శ్రీసింహ పాత్రలో ఒదిగిపోయాడు. అనుకోకుండా సమస్యల్లో చిక్కుకొన్న ఓ యువకుడు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడనే సందర్భంలో తన నటన బావుంది. ఇక నవీన్ అగస్త్య నటనఅప్పటి వరకు నార్మల్‌గానే ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుండి తన యాక్టింగ్ స్టేటస్ నెక్ట్స్ రేంజ్‌కు వెళ్లింది. వెన్నెల కిషోర్, అతుల్య చంద్ర, విద్యుల్లేఖా రామన్, పావలా శ్యామల, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ బావుంది. పాటలన్నీ కథలో భాగంగానే సాగాయి. కాళ భైరవ తన బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. సినిమా నిడివి తక్కువగానే ఉన్నా కాస్త పెద్ద సినిమాలా అనిపిస్తుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ చాలా బావుంది. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీయడం కాదు.. సినిమా అంటే ఎలా తీయాలి? అని చెప్పే అతి కొద్ది సినిమాల్లో మత్తువదలరా సినిమా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
బోటమ్ లైన్: మత్తు వదలరా.. ఆసక్తికరంగా సాగే థ్రిల్లర్ విత్ కామెడి
Read 'Mathu Vadalara' Review in English
- Read in English