ఈ సంక్రాంతికి తమిళంతో పాటు తెలుగులో విడుదలవుతున్న చిత్రాల్లో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్'కు చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇంత క్రేజ్ కారణం ఏంటి?..తమిళంలో హీరో విజయ్ రీజన్ అయితే.. తెలుగు ప్రేక్షకులు మాస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూడటానికి కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఈయన రూపొందించిన గత చిత్రం 'ఖైది' తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ యంగ్ డైరెక్టర్ చేతిలో విజయ్‌లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు సినిమా ఏ రేంజ్ ఉండబోతుందోనని అందరూ అనుకున్నారు. అంతే కాదండోయ్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటించడం మరో విశేషం. కోవిడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సంక్రాంతికి విడుదలైన ఈ భారీ చిత్రం 'మాస్టర్' మరి అంచనాలను అందుకుందా? లోకేశ్ కనకరాజ్‌కు మూడో విజయం దక్కిందా? అనే సంగతులు తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లండి.
కథ:
వరంగల్‌లో లారీ డ్రైవర్ సంఘానికి పెద్ద అయిన వ్యక్తిని ప్రత్యర్థులు చంపేసి, అతని కొడుకు భవాని( విజయ్ సేతుపతి)ని బాల నేరస్థుల జైలుకు పంపుతారు. అక్కడ భవానీని చిత్ర హింసలకు గురి చేస్తారు. దాంతో చిన్నపిల్లాడైన భవానీలో మృగం మేల్కొంటుంది. జైలు నుండి బయటకు వచ్చిన భవాని. బాల నేరస్థులతో కలిసి నేరాలకు పాల్పడుతాడు. క్రమంగా ఎదుగుతూ వస్తాడు. తను ఎదిగే క్రమంలో ఎదురొచ్చిన అందరినీ చంపుతూ వస్తాడు. ప్రతి హత్యకు బాల నేరస్థులను లొంగిపొమ్మని చెబుతుంటాడు. దాంతో ప్రభుత్వం బాల నేరస్థులకు మంచి చెడులు చెప్పడానికి ఓ మాస్టర్‌ను నియమించాలని అనుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి మాస్టర్‌గా వస్తాడు జేడీ(విజయ్). అయితే తన కారణంగా ఓ పెద్ద తప్పు జరుగుతుంది. తన తప్పును జేడీ సరి చేసుకోవాలని అనుకుంటాడు జేడీ. జ్యువనైల్ హోంలోని పిల్లలను మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భవానీతో గొడవపడతాడు. జేడీని అడ్డుకోవడానికి భవానీ ఏం చేశాడు? అసలు జేడీ ఎవరు? ఎందుకు జ్యువనైల్ హోంకు వస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
సినిమా ప్రధానంగా నువ్వా నేనా? అనేలా రెండు పాత్రల మధ్య సాగే చిత్రం. ఓ పాత్ర హీరో విజయ్ అయితే.. మరోపాత్ర విలన్‌గా చేసిన విజయ్ సేతుపతిది. విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేయడంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత హీరో విజయ్ పాత్రను ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. వీరిద్దరి పాత్రలను ఎలివేట్ చేసుకుంటూ రావడంతో ఫస్టాఫ్ దాదాపు ముగిసిపోతుంది. అసలు కథలోకి వెళ్లటప్పటికే ఫస్టాఫ్ పూర్తి. పాత్రల ఎలివేషన్‌కు అంత సమయం ఇవ్వడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షే అనుకోవాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. ఇక సెకండాఫ్ అంతా జ్యువనైల్ హోం బ్యాగ్రౌండ్‌లోనే సాగుతుంది. అక్కడ విలన్ చెరలోని ఉన్న పిల్లలను కాపాడటానికి హీరో విజయ్ ఏం చేశాడు. తనకు ఎదురైన పరిస్థితుల చుట్టూనే కథను తిప్పాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. విజయ్, విజయ్ సేతుపతి ఇద్దరూ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. విజయ్ సేతుపతి చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఇక హీరోయిన్ మంజిమ మోహనన్ పాత్ర చాలా పరిమితంగా ఉంది. నాజర్, అర్జున్ దాస్, శాంతన్ భాగ్యరాజ్, ఆండ్రియా సహా అందరూ వారి వారి పరిధుల మేరకు నటించారు. 'ఖైది' సినిమాను తెరకెక్కించిన దర్శకుడే ఈ సినిమాను తెరకెక్కించాడా? అనే సందేహం ప్రేక్షకుడికి కచ్చితంగా కలుగుతుందనడంలో సందేహం లేదు. హీరో పాత్ర ఏదో వ్యక్తిగత కారణాలతో తాగుడుకి అలవాటు పడుతుంది. ఆ కారణాలేంటనేది మాటల రూపంలో అంత ఎమోషనల్‌గా కనెక్టింగ్‌గా లేదు. బలమైన ఎమోషన్స్ సినిమాలో కనిపించవు. సినిమా సెకండాఫ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది. మూడు గంటల వ్యవథిని రెండున్నర గంటలకు తగ్గిస్తే వచ్చే నష్టమేంటని అందరూ అనుకుంటారు. సినిమా అలా ఉంది మరి. అనిరుద్ సంగీతం వినడానికే బావుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సత్యం సూర్యన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఏదో చేయాలనుకుంటే మరేదో అయ్యిందే అన్నట్లుగా సినిమా తయారైంది. విజయ్ వంటి మాస్ హీరో ఇమేజ్‌ను డైరెక్టర్ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయలేకపోయాడనేది స్పష్టంగా అర్థమవుతుంది.
బోటమ్ లైన్.. మాస్టర్.. గింగరాలు తిరిగాడు
Comments