Pawan Kalyan:రోడ్ షో వద్దు, అభివాదాలు చేయొద్దు.. పవన్ వారాహి యాత్రకు అడుగడుగునా ఆంక్షలు
- IndiaGlitz, [Thursday,August 10 2023]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర గురువారం నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. అయితే పవన్ పర్యటనకు పోలీసుల నుంచి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని పోలీసులు తెలిపారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ రోడ్డులోనే రావాలని కోరారు. నగరంలో పవన్ ఎక్కడా రోడ్ షో నిర్వహించొద్దని.. బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని సూచించారు.
ఆ రూట్లో వెళ్లొద్దు :
కేవలం నగరంలోని జగదాంబ జంక్షన్లో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మధ్యాహ్న సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా వుంటుందనే సాకుతో పవన్ ప్రయాణించే మార్గంలో మార్పులు చేశారు. విమానాశ్రయం నుంచి షీలా నగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసులు కోరారు.
ఆగస్ట్ 19 వరకు మూడో విడత వారాహి యాత్ర :
ఆగస్ట్ 19 వరకు మూడో విడత వారాహి యాత్ర కొనసాగనుంది. అయితే ఆగస్ట్ 15న మాత్రం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని పవన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన వారాహి విజయయాత్రలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మూడో విడతను అంతకుమించిన స్థాయిలో నిర్వహించాలని జనసైనికులకు పార్టీ పిలుపునిచ్చింది.