TTD Board:టీటీడీ బోర్డులో పలు కీలక నిర్ణయాలు.. రమణదీక్షితులపై వేటు..

  • IndiaGlitz, [Monday,February 26 2024]

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్, టీటీడీ అధికారులు, జియ్యంగార్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని.. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. కాగా వైసీపీ ధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే.

ఇక టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టు, సొసైటీల ద్వారా టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచినట్లు తెలిపారు. 9 వేల 750 మందికి వారి కేడర్, సీనియార్టీని బట్టి రూ.3 వేల నుంచి 20వేల వరకు జీతాలు పెంచుతూ పాలకమండలి సమావేశంలో ఆమోద ముద్ర వేశామన్నారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుద్ధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాలతో పాటుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్టు, సొసైటీ, సంభావన ఉద్యోగులకు జీతాలు పెంచామన్నారు. దీంతో టీటీడీలో కాంట్రాక్టు, సొసైటీల ద్వారా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి జీతం పెరిగిందని వెల్లడించారు.

అలాగే టీటీడీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాయిస్ క్యాంటీన్‌లో టిఫిన్, భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో వీరికి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తామని.. ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని భూమన పేర్కొన్నారు.

స్వతహాగా పేదలు, ఉద్యోగుల పక్షపాతినైన తన ద్వారా టీటీడీ లోని ఉద్యోగులందరికీ మేలు జరగడం వారికి జీతాలు పెంచడం, ఇంటి స్థలాలు అందించడం ఎంతో సంతోషం కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత మందికి మేలు చేయించడానికే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు రెండో సారి చైర్మన్‌గా అవకాశం ఇచ్చారేమోనని అభిప్రాయపడ్డారు.

పాలకమండలి నిర్ణయాలు..

గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం.

తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం

శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం

రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీ.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.3 కోట్లతో లైటింగ్ ఏర్పాటుకు ఆమోదం..

ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం

వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపు

అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం

15 పోటు సూపర్‌జర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన.

రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునికీకరణ.

రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయాలలో ఉన్న 682 మోటార్ పంపులు మార్పు

తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్, ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగింపు..

తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు.

రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం.

తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం.

రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్‌ల ప్రింటింగ్.

స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు.

రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం..

అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం..

సూపర్‌వైజర్ పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం..

కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం.. కళ్యాణం నిర్వహణకు ఆమోదం.