కేసులే కేసులు.. ‘బండ్ల’ భవిష్యత్ ఏంటో!?
- IndiaGlitz, [Thursday,October 24 2019]
ఎటు చూసినా కేసులే.. పొద్దున నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ అన్నీ వివాదాలే.. మీడియా ముందుకొచ్చినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా రచ్చరచ్చే.. ఏం చెప్పాలనుకుని వస్తాడో తీరా ఏం మాట్లాడతాడో.. కొన్ని రోజులు సినిమాలు.. మరికొన్ని రోజులు నిర్మాణాలు.. మధ్యలో రాజకీయాలు చివరికి అబ్బే తూచ్ నాకొద్దు అంటూ వెనుతిరగడాలు.. నాలుక కోసుకుంటానని ప్రకటనలు.. ఇవన్నీ ఎవరి లక్షణాలబ్బా అని తెలుసుకోవాలని ఉంది కదూ.. అదేనండి కమెడియన్ కమ్ నటుడు కమ్ నిర్మాతగా పేరుగాంచిన బండ్ల గణేష్.
నిర్మాతగా రేంజ్ మారిపోయింది!
అప్పుడెప్పుడో చిన్నపాటి ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఇంకేముంది నాలుగు పైసలు వెనకేసుకునే సరికి ఎవరో సినిమాల్లో తాను నటించడమేంటి..? తానే ఓ సినిమాను తీసేస్తే పోలా అని ఏకంగా సినిమాలనే నిర్మించేశాడు. అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడ్నుంచి తెచ్చాడు..? ఎవరి సపోర్టుతో నిర్మించాడు..? అనేది ఇక్కడ అనవసరం.. అసందర్భం కూడా.
రాజకీయాల్లోకి వచ్చి...!
ఓ వైపు నటన మరోవైపు నిర్మాణ రంగంలో ఇలా జీవితం సాఫీగానే నడుస్తున్న టైమ్‌లో వివాదాలు సైతం ఎక్కువయ్యాయి. అప్పటి వరకూ వివాదాలకు కాస్త దూరంగా ఉన్న ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడిక ఎక్కడలేనన్ని వివాదాలు. అంటే.. అప్పటి వరకూ అస్సలు వివాదాల జోలికి పోలేదు అని కాదు.. కానీ వార్తల్లో నిలవడం చాలా తక్కువే. ఢిల్లీ వేదికగా నాటి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకోవడం.. ఇక వరుస ఇంటర్వ్యూల్లో ఏదేదో మాట్లాడేయటం.. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే ‘నాలుక కోసుకుంటాను’ ప్రకటించాడు. అయితే ఆ పార్టీకి అడ్రస్ గల్లంతవ్వడంతో బండ్ల కూడా ఈ వివాదం ముగిసేవరకు అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. అలా డిబెట్స్‌లో అస్తమాను నోరు జారడం.. ఇంటర్వ్యూలో కాస్త ఎక్కువగా ఓవరాక్షన్ చేయడం ఇలాంటి వన్నీ తన ఇమేజ్‌ను గట్టిగానే డ్యామేజ్ చేశాయి. అయితే రాజకీయాల్లో పట్టుమని పదిరోజులు కూడా ఆయన ఉండలేక గుడ్‌బై చెప్పి బ్యాక్ టూ మూవీస్ అన్నాడు.
బండ్లకు బ్యాడ్ టైమ్..!
ఇక అసలు విషయానికొస్తే.. నిర్మాతగా మారిన తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల ఇక మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో.. అది బ్యాడ్ లక్ అనుకోవాలో.. లేకుంటే మరొకటి అనుకోవాలో తెలియట్లేదు కానీ ఎప్పుడెప్పుడో జరిగిన వివాదాలన్నీ తెరపైకి రావడం.. అప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ తిరగతోడటంతో బండ్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈయనపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నో.. ఎన్నెన్నో కేసులు!
- వైసీపీ నేత, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ పీవీపీతో లావాదేవీల విషయంలో.. తన అనుచరులతో ఆయన ఇంటికెళ్లి మరీ బండ్లగణేష్ హల్ చల్ చేయడం.. బెదిరించడంతో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా బుధవారం నాడు బండ్లను అదుపులోకి తీసుకోవడం.. విచారణ, బెయిల్‌పై బయటికి రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
- ఈ వివాదం సద్దుమణగముందే మళ్లీ కడప జిల్లాలో కేసు బయటికి రావడం.. అప్పట్లో అప్పుగా కోట్లల్లో డబ్బులు తీసుకుని తిరిగివ్వకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని గురువారం నాడు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించడం జరిగింది.
- అప్పట్లో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ను గణేష్ చీటింగ్ చేశారని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పొవల్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ వ్యవహారంలో ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. 2016 నుంచి ఇప్పటికీ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చెక్‌బౌన్స్‌ల కేసులు అయితే కోకొల్లలు. ఒకటా రెండా బండ్లపై కేసులే కేసులు.
బండ్లకు నిద్రకు కరువైందట!?
ఇలా వరుస కేసుల నేపథ్యంలో బండ్లకు ఎప్పుడు ఏ స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేస్తారో.. ఏ కోర్టు నుంచి సమన్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ వరుస కేసులు, కోర్టులు, అరెస్ట్‌ల వ్యవహారంతో బండ్లకు ఈ మధ్య కంటి మీద సరిగ్గా కునుకు లేకుండా పోతోందట. అయితే ఈ కేసుల నుంచి ఆయన ఎప్పుడు బయటపడతాడో..? మళ్లీ ఎప్పుడు నిర్మాతగా, నటుడుగా నిలదొక్కుకుంటాడో ఏంటో..? మొత్తానికి చూస్తే ఈ కేసులు, అరెస్ట్‌లు రిమాండ్‌లు బండ్ల గణేష్ భవిష్యత్తుకు కొంచెం సంకటంగా మారిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా జరిగిందేదో జరిగిపోయింది.. వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని మళ్లీ బతుకు బండిని సాగించాలని.. లేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమే అని బండ్లకు సినీ క్రిటిక్స్, సినీ ప్రియులు సూచిస్తున్నారు. మరి మున్ముంథు బండ్ల పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.