‘సినీ అమ్మ ముద్దుబిడ్డలు.. 2020 బెస్ట్ ఫొటో’

చిరంజీవికి, తనకు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ని రోజులుగా చిరుతో గొడవలు అంటూ వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఒకే త‌ల్లి బిడ్డలమని.. మా మ‌ధ్య ఛ‌లోక్తులు మాత్రమే న‌డుస్తుంటాయ్ తప్ప ఎలాంటి గొడ‌వ‌లు ఉండ‌వని మోహ‌న్‌బాబు తెలిపారు. ఈ క్రమంలో మోహ‌న్‌బాబు పక్కనే ఉన్న చిరంజీవి ఆయ‌న్ని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకుని గ‌ట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఇప్పుడు చిరు, మోహ‌న్‌బాబు ఆత్మీయ ఆలింగ‌నం, ముద్దు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదే బెస్ట్ ఫొటో!

‘సినీ అమ్మ ముద్దుబిడ్డలు.. 2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో’ అని లవ్ సింబల్ ఉన్న ఎమోజీలను మనోజ్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన మెగాభిమానులు, మంచు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. చిరు-మోహన్‌బాబును ముద్దాడిన ఫొటొను.. మనోజ్-రామ్ చరణ్ ఉన్న ఫొటోలను అభిమానులు పోస్ట్ చేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. వీరాభిమానులు ఈ ఫొటోలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలున్నాయని పుకార్లకు ఇవాళ్టితో ఫుల్‌స్టాప్ పడటం శుభపరిణామమేనని చెప్పుకోవచ్చు.