'మన్మథుడు' కి 15 ఏళ్లు
- IndiaGlitz, [Wednesday,December 20 2017]
అక్కినేని నాగార్జున కెరీర్లో.. ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో మన్మథుడు ఒకటి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో రెండు ఛాయలున్న అభిరామ్ పాత్రలో నాగ్ ఒదిగిపోయారనే చెప్పాలి. చూడడానికి మన్మథుడిలా ఉండే ఓ యువకుడు.. స్త్రీ ద్వేషిగా ఎందుకు మారాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. నాగ్‌లోని కొత్త కోణాన్ని చూపింది. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు కె.విజయ్ భాస్కర్ ఖాతాలో మరో విజయాన్ని అందించిన మన్మథుడుకి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన మాటలు ఎస్సెట్‌గా నిలిచాయి.
ఇక యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలైతే యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. దేవి కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్‌గా మన్మథుడు నిలిచిందని చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, అన్షు కథానాయికలుగా నటించారు. 2002కిగానూ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని పొందిన మన్మథుడు.. డిసెంబర్ 20, 2002న విడుదలైంది. కొసమెరుపు ఏమిటంటే.. కన్నడంలో ఐశ్వర్య పేరుతో రీమేక్ అయిన ఈ సినిమాతోనే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటనలో తొలి అడుగులు వేసింది.