Download App

Manmadhudu 2 Review

2002లో నాగార్జున హీరోగా విడుద‌లైన `మ‌న్మ‌థుడు` ఎంత‌టి విజయాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఆ సినిమాకు త్రివిక్ర‌మ్ డైలాగ్స్.. విజ‌య్ భాస్క‌ర్ టేకింగ్ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. 16 ఏళ్ల త‌ర్వాత దానికి సీక్వెల్‌గా `మ‌న్మ‌థుడు 2` రూపొందింది. ఇందులోనూ నాగార్జునే హీరో కావ‌డం ఓ విశేషమైతే. ఆయన లుక్‌లో ఏమాత్రం తేడా లేక‌పోవ‌డం మ‌రో విశేషం. అయితే మ‌న్మ‌థుడులో హీరో స్రీలంటే మండిప‌డుతుంటారు. కానీ మ‌న్మ‌థుడు 2లో హీరో ప్లేబాయ్ అని టీజ‌ర్ చూడ‌గానే అర్థ‌మైంది. సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా పోర్చుగ‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగింది. పాత్ర‌ల ప‌రంగా ఇంత వేరియేష‌న్ ఉండేలా.. ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించాడు ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. మ‌రి రాహుల్ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేశాడో తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే... 

కథ:

సాంబశివరావు అలియాస్‌ సామ్‌(నాగార్జున అక్కినేని) ఫ్యామిలీ మూడు తరాలుగా పోర్చుగల్‌లో సెటిలై ఉంటారు. తల్లి(లక్ష్మి), అక్కలు(ఝాన్సీ, దేవదర్శిని), చెల్లెలు, వారి భర్తలు ఇలా సామ్‌ కుటంబం చాల పెద్దది. సామ్‌ను ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతుంటారు. అయితే ప్లేబోయ్‌ అయిన సామ్‌ తన వ్యవహారాలను ఇంట్లో తెలియకుండా రహస్యంగా సాగిస్తుంటాడు. సామ్‌ అసిస్టెంట్‌(వెన్నెలకిషోర్‌)తో ఇంట్లో కాకుండా సామ్‌ బయట ఉంటుంటాడు. ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారని భావించిన సామ్‌, పెళ్లి తప్పించుకోవాలని ఓ ప్లాన్‌ వేస్తాడు. పోర్చుగల్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసే తెలుగు అమ్మాయి అవంతిక(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)తో ఓ డీల్‌ కుదుర్చుకుంటాడు. దాని ప్రకారం పెళ్లి ముందు రోజు అవంతికి పెళ్లి ఇష్టం లేదంటూ వెళ్లిపోవాలి. అనుకున్నట్లే అవంతిక వెళ్లిపోతుంది. దాంతో సామ్‌ తల్లి హాస్పిటల్‌ పాలవుతుంది. దాంతో అవంతిక మళ్లీ ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామ్‌ ఏం చేస్తాడు? మరోసారి అవంతిక వచ్చి ఏ పనులు చేస్తుంది? దాని వల్ల సామ్‌ జీవితంలో జరిగే మార్పులేంటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్‌ పాయింట్స్‌:

- నటీనటుల పనితీరు
- వెన్నెలకిషోర్‌ కామెడీ
- సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

- పాత్రల చిత్రీకరణ సెకండాఫ్‌లో బలంగా లేకపోవడం
- బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం
- సంగీతం, నేపథ్య సంగీతం

విశ్లేషణ:

17 ఏళ్ల క్రితం విడుదలైన 'మన్మథుడు' సినిమా లైన్‌కు డిఫరెంట్‌గా తెరకెక్కించిన చిత్రం 'మన్మథుడు 2'. మన్మథుడులో హీరో అమ్మాయిల ప్రేమ విఫలమైన కారణంగా ద్వేషిస్తుంటాడు. కానీ మన్మథుడు 2లో హీరో ప్లేబోయ్‌. ఇందులో హీరో ప్లేబోయ్‌గా మారడానికి బలమైన కారణాలు అంటూ ఏమీ ఉండదు. ఓ కామెడీ యాంగిల్‌లో సినిమా సాగుతుంది. హీరో క్యారెక్టర్‌ను కామెడీ యాంగిలోనే ప్రొటేట్‌ చేసే ప్రయత్నం చేశారు. హీరో బ్యాక్‌డ్రాప్‌ను పోర్చుగల్‌ నేపథ్యంలో తెరకెక్కించడం ఇక్కడొక ప్లస్‌గా మారింది. మన్మథుడులో త్రివిక్రమ్‌ డైలాగ్స్‌, సన్నివేశాలు, ఎమోషన్స్‌ బలంగా ఉన్నాయి. కానీ కామెడీనే ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. ప్రథమార్థమంతా వెన్నెలకిషోర్‌ కామెడీ ప్రధానంగా సాగుతుంది. నాగార్జున ఆరు పదుల వయసులోనూ యంగ్‌గానే కనిపించారు. లుక్‌ పరంగా సమస్య లేదు. ఇక పాత్ర పరంగా చూస్తే ఓసీడీ ఉండే పాత్రలో.. అలాగే ఎలాంటి వాసననైనా పసిగట్టే పాత్రలో నాగార్జున తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. పోర్చుగల్‌లో ఉండే తెలుగు అమ్మాయి.. హీరోతో డీల్‌ కుదుర్చుకుని వచ్చి.. చివరకు అతని ఇంట్లో మనిషిలా ఎలా మారిపోయిందనే పాత్రధారి అవంతికగా రకుల్‌ చక్కగా నటించింది. ఓవర్‌ ఎక్స్‌పోజ్‌ లేకుండా గ్లామర్‌గా నటించింది. సిగరెట్‌ తాగే సన్నివేశాలు.. ఝాన్సీకి లిప్‌లాక్‌ చేసే సన్నివేశాల్లో బోల్డ్‌గానే నటించింది. పాత్రను ఆమె పొట్రేట్‌ చేసిన తీరు బావుంది. ఇక కామెడీ భారాన్నంతా వెన్నెలకిషోరే మోశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌ అంతా సినిమాను వెన్నెలకిషోర్‌ భుజాలపై మోశాడు. తన పాత్ర సెకండాఫ్‌లో తగ్గినా.. కామెడీని క్యారీ చేయడంలో వెన్నెలకిషోర్‌ ఎక్కడా తగ్గలేదు. సీనియర్‌ నటి లక్ష్మి, రావు రమేశ్‌. దేవదర్శిని, ఝాన్సీ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఫ్రెంచ్‌ రీమేక్‌ను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కామెడీ టింజ్‌ సన్నివేశాల్లో మిస్‌ కాకుండా చూసుకున్నారు. అయితే ఎమోషన్స్‌, పాత్రల చిత్రీకరణను వాటికి మిళితం చేసే విధానంలో కేర్‌ తీసుకుని ఉండుంటే బావుండేదనిపించింది. చైతన్‌ భరద్వాజ్‌ పాటలు పెద్దగా బాలేవు. నేపథ్య సంగీతం ఓకే. సుకుమార్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పోర్చుగల్‌ అందాలను మరింత అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తంగా మన్మథుడుకి, మన్మథుడు 2కి సంబంధం లేదు

బోటమ్‌ లైన్‌: మన్మథుడు 2... ఈసారి కుటుంబ కథా ప్రేక్షకుల కంటే యూత్‌నే టార్గెట్‌ చేశాడు.

Read 'Manmadhudu 2' Review in English

Rating : 2.5 / 5.0