Alla Ramakrishna Reddy:సొంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. త్వరలో సీఎం జగన్‌తో భేటీ..!

  • IndiaGlitz, [Tuesday,February 20 2024]

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈరోజు ఒక్క పార్టీలో ఉన్న వారు రేపు మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇటీవల మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన ఆర్కే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల నియమితులు కావడంతో హస్తం పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌లో తనకు అంత ప్రాధాన్యత దక్కడం లేదని ఆర్కే కినుక వహించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆర్కేతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయిపోయింది ఏదో అయిపోయింది.. పార్టీలోకి తిరిగి వస్తే సముచిత గౌరవం, అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇప్పించేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో జగన్‌తో భేటీకి మార్గం సుగమం అయింది. ఆయనకు మంగళగిరి గెలుపు బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా మరో వాదన ఉంది.

మంగళగిరిలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారని టాక్. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో లోకేష్‌పై విజయం సాధించి టీడీపీకి షాక్ ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట తప్పడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవిని పార్టీ ఇంఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. పార్టీలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవసరమైతే జగన్ అవినీతిపై కోర్టులకు కూడా వెళ్తానని హెచ్చరించారు. అలాగే మంగళగిరిలోని తన కార్యాలయంలో జగన్ ఫ్లెక్సీలు, ఫొటోలు సైతం తీసి బయట విసిరేశారు. తన చివరి శ్వాస వరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని తెలిపిన ఆర్కే.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేకపోవడంతో మళ్లీ సొంత గూటికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.