మేడారం జాతరలో కీలక ఘట్టం.. నేడు మండమెలిగె పండుగ

  • IndiaGlitz, [Wednesday,February 09 2022]

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం ‘‘సమ్మక్క- సారలమ్మ’’ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది. ఇక వనదేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మేడారం జాతర లాంఛనంగా మొదలైనట్లుగా చెబుతారు. ఈ కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు.

సమ్మక్క కూతురైన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని గిరిజన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు స్వస్థలాలకు బయలుదేరతారు.