పరువుహత్యపై స్పందించిన హీరో మంచు మనోజ్..
- IndiaGlitz, [Monday,September 17 2018]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్యపై హీరో మంచు మనోజ్ స్పందించారు. కులం పేరుతో ప్రణయ్ ను అతి దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీనిపై తన బాధను ఓ లేఖ రూపంలో తెలిపాడు మనోజ్.
మానవత్వం కంటే కులమతాలు ఎక్కువ అని ఫీల్ అవుతున్న అందరి కోసమే ఈ లేఖ రాస్తున్నాను అంటూ మొదలుపెట్టాడు మనోజ్. కులగజ్జి ఎక్కడున్నా తప్పే.. ఈ రోజుల్లో హీరోల కులాలు.. రాజకీయ పార్టీల్లోనూ కులాలే.. కాలేజ్ యూనియన్స్ లో కులాలే.. మతాలు.. వాటి సంఘాలు.. ఇలా అన్నింటితో ఈ రోజుల్లో సమాజం నిండిపోయింది.
ఇంత కులగజ్జి ఉన్న ప్రతీఒక్కరు ప్రణయ్ లాంటి ఎంతోమంది అమాయకుల హత్యలకు వాళ్లు కూడా తెలియకుండా బాధ్యులే. మనం ఆలోచించుకునే సమయం కూడా వచ్చేసింది. ఓ పుట్టని పసిగుడ్డు తన తండ్రిని కోల్పోయింది. కనీసం తన స్పర్ష కూడా లేకుండానే ఆ బేబీ ఈ భూమ్మీదకు రాబోతుంది. తండ్రి ఎలా ఉంటాడో తెలియకుండా చేసింది ఈ సమాజం. మనం బతుకుతున్న ప్రపంచం.. సమాజం.. మనకు ఉన్న గుండె.. రక్తం.. గాలి అందరికీ ఒక్కటే అయినపుడు కులం పేరుతో ఇలా విడదీయడం.. చంపుకోవడం నిజంగా మంచిదేనా..?
అసలు దీనికి మనమంతా అర్హులమేనా..? బతకనీకుండా అలా చంపేసి ఏం నేర్చుకుంటున్నాం మనం..? ఈ కులం మతం కాదు మనమంతా ఒక్కటే.. అంతా మనుషులమే అని ఎప్పటికి తెలుసుకుంటాం.. కులాలని సపోర్ట్ చేసే వాళ్లను చూస్తుంటే సిగ్గుపడండి.. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.. కులం పేరుతో చంపే ప్రతీ ఒక్కరూ ఈ నేరంలో భాగం అవుతారు. ఎవరో ఒక్కర్ని మాత్రమే ఇందులో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు.. అంతా దీనికి బాధ్యులే.
ఇప్పటికైనా ఈ కులాన్ని మూసేయండి. ఈ కులం అనేది ఓ రోగం అని తెలుసుకుని.. కనీసం ఇప్పటికైనా మనుషుల్లా బతకడం నేర్చుకోండి.. నా మనసులోంచి అందర్నీ ఇది వేడుకుంటున్న మాట. రాబోయే తరానికైనా మంచి ప్రపంచాన్ని ఇద్దాం. నా మనసు ప్రణయ్ భార్య అమృత.. ఆమె కుటుంబం వైపు వెళ్తుంది. దేవుడు వాళ్లకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రణయ్ మమ్మల్ని క్షమించు.. నిన్ను కాపాడుకోలేకపోయినందుకు.
థ్యాంక్ యూ
మంచు మనోజ్