Manchu Lakshmi:విష్ణు - మనోజ్ మధ్య గొడవ.. రంగంలోకి లక్ష్మీప్రసన్న, వివాదంపై ఏమన్నారంటే..?

  • IndiaGlitz, [Saturday,March 25 2023]

మంచు బ్రదర్స్ మధ్య గొడవ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కుటుంబ పరువు రోడ్డుకెక్కడంతో మోహన్ బాబు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అటు కొడుకులకు సర్దిచెప్పుకోలేక ఆయన నలిగిపోతున్నారు. మోహన్‌బాబు కుటుంబ సభ్యులతో పాటు ఆ ఫ్యామిలీకి సన్నిహితంగా వుండే పలువురు సినీ ప్రముఖులు సైతం రంగంలోకి దిగి విషయాన్ని సెటిల్ చేసే పనిలో వున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై మోహన్ బాబు కుమార్తె , సినీనటి మంచు లక్ష్మీప్రసన్న స్పందించారు.

కుటుంబం అన్నాక గొడవలు సహజం:

కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య గొడవలు వుంటాయని.. దీనిని ఫ్యామిలీ అంతర్గత విషయంగానే పరిగణించాలని లక్ష్మీ ప్రసన్న అన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఇద్దరి మధ్యా వివాదం పరిష్కారమవుతుందని ఆమె ఆకాంక్షించారు. నిజానిజాలు తెలియకుండా ఎలాంటి అభిప్రాయాలను వ్యాప్తి చేయకూడదని లక్ష్మీ పేర్కొన్నారు. మరోవైపు .. మోహన్ బాబు కూడా విష్ణు, మనోజ్‌ల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను లక్ష్మీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది.

సారథి అనే వ్యక్తిపై దాడికి దిగిన విష్ణు :

గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబుకు బంధువైన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో మనోజ్ అక్కడే వుండటంతో ఈ తతంగాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘‘ఇలా ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువులను ఇలా కొడుతూ వుంటాడని.. ఇది సిచ్యుయేషన్’’ అంటూ మనోజ్ రాశారు. మరోవైపు అన్నాదమ్ముల మధ్య గొడవ నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కారంటూ కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సూచన మేరకు మనోజ్ సదరు వీడియోను ఎఫ్‌బీ నుంచి డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు సహజమేనని.. ఇద్దరి మధ్యా సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని మోహన్ బాబు ఓ ఛానెల్‌తో అన్నట్లుగా తెలుస్తోంది.

ఘనంగా మంచు మనోజ్- మౌనిక వివాహం:

ఇదిలావుండగా.. ఈ నెల 3న మంచు మనోజ్- మౌనిక వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భార్యను ముద్దాడుతూ మనోజ్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. కొత్త జంట చూడముచ్చటగా వుంది. గోల్డ్ కలర్ పట్టు కుర్తా, దోతిలో మంచు మనోజ్.. ఆకుపచ్చ, పింక్ కలర్ పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం మనోజ్-మౌనికా రెడ్డిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.