Nandamuri Balakrishna : బాలయ్య ‘‘వీరసింహారెడ్డి’’ కోసం మంచు లక్ష్మీ ఫ్రీ ప్రమోషన్.. ఆ స్టెప్స్ అదరహో

  • IndiaGlitz, [Friday,January 13 2023]

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకు అంతా వీరసింహారెడ్డి మేనియా కనిపిస్తోంది. అంతేకాదు.. చిత్ర యూనిట్ సైతం ప్రమోషన్స్ కార్యక్రమాలు సైతం మొదలుపెట్టింది. అయితే వీరసింహారెడ్డికి మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ ప్రసన్న ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తోంది.

మా బావ మనోభావాలకి స్టెప్స్ వేసిన మంచు లక్ష్మీ :

మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే. ఆమె పెట్టే పోస్ట్ కూడా వైరల్ అవుతూ వుంటుంది. ఈ క్రమంలోనే ఆమె బాలయ్య లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డిలోని ‘‘ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’’ పాటకు స్టెప్పులు వేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు మంచు లక్ష్మీ. ఈ సినిమా చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆమె కామెంట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. బాలయ్య బాబు ఫ్యాన్స్‌ ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.

అన్నగారి హయాం నుంచి మంచు ఫ్యామిలీతో అనుబంధం:

ఇకపోతే.. నందమూరి కుటుంబానికి, మంచు ఫ్యామిలీకి అన్న గారి హయాం నుంచి మంచి అనుబంధం వుంది. ఎన్టీఆర్‌ను మోహన్ బాబు దైవంలా ఆరాధిస్తారు. తన అభిమాన నటుడితో ఆయన ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలను సైతం నిర్మించారు. అదే అనుబంధాన్ని బాలయ్యతో సైతం మోహన్ బాబు కొనసాగిస్తున్నారు. మంచు వారసుల్లో లక్ష్మీప్రసన్నకు బాలకృష్ణతో ప్రత్యేక అనుబంధం వుంది. ఆమె కోసం ‘‘ ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’’.. సినిమాలో బాలయ్య నటించారు. ఇక ఇటీవల బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 1కు మంచు ఫ్యామిలీ మొత్తం వచ్చి సందడి చేసింది.

వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.