Manasuku Nachindi Review
తెలుగు చిత్ర సీమలో మహిళా దర్శకులు చాలా తక్కువ. ఇప్పుడు `మనసుకు నచ్చింది` సినిమాతో మరో మహిళా దర్శకురాలు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. ఆవిడెవరో కాదు మంజుల ఘట్టమనేని. కృష్ణ తనయ, మహేష్ సోదరిగా ఒకప్పుడు రెండు, మూడు సినిమాల్లో నటించిన మంజుల దర్శకురాలిగా టర్న్ తీసుకున్నారు. ప్రకృతి, ప్రేమకు ఉన్న రిలేషన్‌ను ఆధారంగా చేసుకుని మంజుల తెరకెక్కించిన సినిమాయే `మనసుకు నచ్చింది` మరి ఈ సినిమాతో మంజుల దర్శకురాలిగా ఎలాంటి పేరు సంపాదించుకున్నారో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూడాల్సిందే.
కథ:
సూరజ్(సందీప్ కిషన్), నిత్య(అమైరా దస్తుర్) చిన్నప్పట్నుంచి కలిసి పెరుగుతారు. ఇద్దరి మధ్య ఉన్న సానిహిత్యం చూసిన రెండు కుటుంబాల పెద్దలు వారికి పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ కలిసి పెళ్లి పీటలపై నుండి లేచిపోతారు. గోవా చేరుకున్న తర్వాత నిత్య యోగా క్లాసులు చెప్పడం మొదలు పెడుతుంది. నిత్యకు ఆదిత్ పరిచయం అవుతాడు. ఫోటోగ్రాపర్ కావాలనుకున్న సూరజ్‌కి నిక్కి(త్రిదా చౌదరి) పరిచయం అవుతుంది. మంచి ఫోటోగ్రాఫర్‌గా రాణించాలనుకునే సూరజ్ కొన్ని సందర్భాల్లో ఫెయిలైనా.. నిత్య ఇచ్చే ధైర్యంతో ముందుకెళుతుంటాడు. క్రమంలో సూరజ్‌తో నిత్య ప్రేమలో పడుతుంది. అయితే ముందుగా నిత్య అంటే తనకెలాంటి లవ్ లేదని అనుకున్న సూరజ్‌కి క్రమేణ ఆమె అంటే ప్రేమ ఉండటాన్ని గమనిస్తాడు. అంతలోనే ఆదిత్‌తో నిత్య పెళ్లి రెడీ అవుతుంది. మరి సూరజ్ నిత్యను ఎలా సొంతం చేసుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మెయిన్ లీడ్స్‌లో నటించిన సందీప్ కిషన్, అమైరా దస్తుర్, త్రిదా చౌదరిలు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అలాగే మిగిలిన పాత్రధారులు కూడా. సందీప్, అమైరా మధ్య కెమిస్ట్రీ సీన్స్ మెప్పిస్తాయి. మఖ్యంగా యువతను ఆకట్టుకుంటాయి. ఇక ప్రకృతికి మహేష్ వాయిస్ ఓవర్ చెప్పడం పెద్ద ప్లస్. జాన్వి పంచ్‌లు. ఇక రవియాదవ్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రతీ సన్ రిచ్‌గా కనపడింది. రథన్ నేపథ్య సంగీతం బావుంది.
మైనస్ పాయింట్స్:
కథ కంటే ప్రకృతిపైనే ఫోకస్ ఎక్కువైనట్లు అనిపించింది. దీనికి వల్ల అసలు కథ పక్కకు వెళ్లిపోతుంది. అయితే ప్రస్తావించాల్సిన విషయమేమంటే పోనీ కథలో ఎమైనా కొత్తదనం కనపడుతుందా? అంటే అదీ లేదు. హీరో హీరోయిన్స్ ప్రేమించుకోకపోవడం.. క్రమేణ ఇద్దరూ ప్రేమలో పడం అనే కాన్సెప్ట్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చేసాయి. ఎమోషనల్ సీన్స్‌లో ఆర్టిస్టులు సరిగ్గా నటించలేదు. కథనంలో కొత్తదనం లేకపోవడం, ట్యూన్స్ ఆకట్టుకునేలా లేవు.
సమీక్ష:
మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించే ఎక్కువగా దర్శకులు కథలను తయారు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే మంజుల చేసింది. ప్రకృతి అంటే మనం. మనలోనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలంతే .. అప్పుడు అన్నీ మన దగ్గరకు వస్తాయనే ఫిలాసఫీతో సినిమా కథను తయారు చేసుకున్నారు. హీరో హీరోయిన్లు ముందు కొట్టుకుంటూ ఉండటం.. వారి మధ్య సానిహిత్యం చూసిన కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలనుకుంటే తూచ్..మా మధ్య అదేం లేదని చెప్పడం.. తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టడం అనే కథ, కథనం తెలుగు ప్రేక్షకుడు ఎప్పటి నుండో సినిమాల రూపంలో చూస్తున్నాడు. ఉదాహరణకు నువ్వేకావాలి, నువ్వు లేక నేను లేను వంటి చాలా చిత్రాలను చెప్పుకోవచ్చు. లాజిక్ లేని సన్నివేశాలు దీనికి జత కూడాయి. సందీప్ ఉన్నట్టుండి మంచి ఫోటోగ్రాఫర్‌గా మారిపోవడం వంటివి. ఇలాంటి కథకు కొత్తగా ఆలోచించిన విషయమేంటో అర్థం కాలేదు మరి. సినిమాను మనకు నచ్చినట్టు కాదు.. ప్రేక్షకులకు నచ్చినట్టు తీయాలి మరి.
బోటమ్ లైన్: మనసుకు నచ్చింది.. నచ్చాల్సింది దర్శక నిర్మాతలకు కాదు.. ప్రేక్షకులకు
- Read in English