పేదవాడి జీవనాడి మనం సైతం...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ మనం సైతం పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. తాజాగా మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం అందించింది.
ఆదివారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన మనం సైతం సేవా కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, దర్శకుడు మారుతి, నటుడు కృష్ణుడు, నిర్మాత రాజ్ కందుకూరి, పాత్రికేయులు క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల కార్మికులు, కార్మిక కుటుంబాలకు చెందిన గౌతమి, డాన్సర్ బి శంకర్ పాప నిష్ట, రచయిత ఎం శ్రీనివాసులు, వెంకటలక్ష్మి, సాయి కార్తీక్, డ్రైవర్ ధర్మారావు, సునంద, దిలీప్ లకు ఆర్థిక సహాయం అందించారు. చెక్ ల పంపిణీ అనంతరం
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మన కాళ్లకు తాకిందని సముద్రపు అలను చులకనగా చూడకూడదు. సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన పేదవాడిని తక్కువగా చూడొద్దు. మొదట్లో పరిశ్రమలో ఎవరికైనా కష్టం వస్తే అనారోగ్యం పాలైతే ఎవరూ పట్టించుకునేవారు కాదు. మాకు కష్టముందని చెప్పుకుంటే దగ్గరకు రానీయరేమో అని భయపడేవారు. కానీ ఇవాళ మనకు కష్టమొస్తే ఆదుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది అని మనం సైతం నిరూపించింది. మాకు సరైన వేదిక లేక ఎవరి కష్టం నిజమో తెలియక సహాయం చేయడం లేదు.
నువ్వు మంచి మార్గం చూపించావు. దీని ద్వారా మేము సహాయం చేస్తాం అంటూ ఎందరో పెద్దలు మనం సైతంలో భాగమవుతున్నారు. ఈ పెద్దలు మనం సైతంలో చేరుతున్నారు అంటే రెండు రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లే. నాతో ముఖ పరిచయం లేని వాళ్లు కూడా నా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో చూసి విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మనం సైతంను మరింత విస్తృతమైన సేవా సంస్థగా మార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాం. పేదల చిరునవ్వు చూడటమే నా ఆశ. అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ....మనం సైతం గురించి విన్నాను. కొన్ని వీడియోలు చూశాను. కానీ ఇక్కడికి వచ్చాక...ఎంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారో అర్థమైంది. మనం సైతంకు నా వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఇంకా ఏదైనా అవసరం వస్తే నా ఇంటి తలుపు తట్టమని చెబుతున్నాను. అన్నారు.
రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...ఎన్నో పెద్ద ఉద్యోగాలు చేసిన నాకు సినిమా రంగమంటే ఇష్టం. ఇక్కడే స్థిరపడాలి అనుకున్నాను. తోకలేని పిట్ట అనే సినిమా నిర్మించి సర్వస్వం పోగొట్టుకున్నాను. రోడ్డున పడ్డాను. అయినా నాకు చిత్ర పరిశ్రమ అంటే ప్రేమ తగ్గలేదు. ఇక్కడే ఉండాలనిపించింది. అలాగే కాదంబరి కిరణ్ నటుడిగా కొనసాగుతున్నా అతనికి ఇంకేదో చేయాలి అనే తపన ఊరికే ఉండనివ్వలేదు. అలా మనం సైతంను సేవా సంస్థను ప్రారంభించి సంతృప్తి పొందుతున్నాడు. నా వంతుగా లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నాను. అన్నారు.
మనం సైతం సభ్యుడు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బందరు బాబీ మాట్లాడుతూ...కాదంబరి కిరణ్ అన్నకు పేదవాళ్లకు సేవ చేయాలనే స్వార్థం ఎక్కువ. ఆయన వెంట నిత్యం మేము నడుస్తాం. అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రపురి కాలనీ కమిటీ సభ్యుడు మహానందరెడ్డి 50 వేల రూపాయలు జూనియర్ యూనియన్ తరపున సెక్రటరీ అనిల్ లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments