దటీజ్ రామ్ చరణ్.. మంచి మనసుకు ఈ ఘటనే నిదర్శనం , కాదంబరి కిరణ్ పోస్ట్ వైరల్
- IndiaGlitz, [Tuesday,April 12 2022]
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. అంతేకాదు ... సామాజిక సేవలోనూ చిరంజీవికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో విరాళాలు ప్రకటించడంతో పాటు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాల్లోనూ చరణ్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ మంచి మనసు గురించి చెప్పారు సీనియర్ నటుడు కాదంబరీ కిరణ్.
‘‘ మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నేను తెలుసుకున్నా.. ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం.. ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్‌ని సాయం అడిగి 2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అవికాక సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె నెలల పాప పేరున ఎఫ్‌డీ చేయమని ఇచ్చాం. ఇప్పుడు.. ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్ చరణ్ ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ? అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ పోస్టును మరో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ రామ్ చరణ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే.. కాదంబరి కిరణ్ ఎక్కువగా హాస్యప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు 300 సినిమాల్లో నటించి ప్రజలను నవ్వించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో 'మనం సైతం' సంస్థ ఏర్పాటు చేసి పలు సేవా కార‍్యక‍్రమాలు నిర్వహిస్తున్నారు కాదంబరి కిరణ్.