మనందరి బాగు కోసం మనం సైతం...
Send us your feedback to audioarticles@vaarta.com
కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రదాన కార్యదర్శి సంతోష్ కుమార్, నట కిరీటి రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, జెమినీ కిరణ్ తో పాటు మనం సైతం సభ్యులు బందరు బాబీ, చిల్లర వేణుగోపాల్, సురేష్, సన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న రమణమూర్తి, డ్రైవర్ రాజు, మేకప్ రాజశేఖర్, లైట్ మెన్ బాబు, గిరయ్య, రాంప్రసాద్ తదితర పది మందికి సంతోష్ కుమార్, రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, జెమినీ కిరణ్ చేతుల మీదుగా చెక్ లు అందజేశారు.
అనంతరం మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం కళ్ల ముందు కనిపిస్తోంది. సంతోషన్న, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి మంచి వాళ్ల అండ దొరికింది. 1977 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు వచ్చాను. బంధువులు అడిక్ మెట్ లో ఉండేవాళ్లు. అప్పుడు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారి అబ్బాయితో నాకు మితృత్వం ఏర్పడింది. అలా జి.కృష్ణ గారి సాన్నిహిత్యం దొరికింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కరస్పాండెంట్ గా జి.కృష్ణ పనిచేసేవారు. మంత్రులు ఆయన ఇంటి ముందు వేచి ఉండేంత పరపతి ఉన్నా...సొంత ఇళ్లు గురించి కూడా ఆలోచించలేదు. నిస్వార్థంగా జీవించారు.
అద్దె ఇంటిలో బతికి అక్కడే కన్నుమూశారు. అలాంటి వాళ్ల సాహచర్యం నాలో సేవా ఆలోచన రేకెత్తించింది. నిస్వార్థంగా ఉండటం, నలుగురికి సహాయ పడాలనే దృక్పథాన్ని కలిగించింది. ఈ ప్రపంచంలో మనల్ని మనమే నమ్ముకోవాలి, మనకు మనమే అండగా నిలబడాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే మనం సైతం. ముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువువతోంది. సంస్థ ప్రధాన సభ్యులమే పాతిక మంది దాకా ఉన్నాం. ప్రతి జీవి సంపాదన ఆహారమే.
అవి దొరికిన ప్రతి ఆహారాన్ని తోటి వాళ్లతో పంచుకుంటాయి. మనిషి మాత్రమే తన సంపాదన తన వాళ్లకే దక్కాలనుకుంటాడు. స్వార్థంగా ఆలోచిస్తాడు. జి.కృష్ణ లాంటి గొప్పవాళ్ల జీవితాలను తెలియపరిస్తే ప్రతి హృదయం కదులుతుంది. ప్రతి మనసు మారుతుంది. నాకున్నది ఒక మెతుకే కదా అని దాన్ని కూడా వెనకేసుకుంటున్నారు. వంద మెతుకులు కలిస్తే ఒక ముద్ద. వంద ముద్దలు కలిస్తే ఒక జీవితం. మనం సైతం స్ఫూర్తి ఇదే. మా సంస్థ కార్యక్రమాలు చూసి దర్శకులు కొరటాల శివ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
చిరంజీవి గారు ఇంటికి పిలిచి..రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. మనం సైతంతో నేనున్నాను అని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కంటే మనం సైతం గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రశంసించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం సైతం కార్యక్రమాలను అభినందించారు. ఇప్పుడు ఈ పెద్దలు మా వెంట నడుస్తామని ముందుకొచ్చారు. మనస్ఫూర్తిగా వీళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.....మాటలు చెప్పడం నాకు చేతకాదు. చేయాలనుకున్నది చేతల్లో చేస్తుంటాను. మనం సైతంలో నేను కూడా ఉన్నానని తెలియజేస్తున్నాను. నా వంతుగా రెండు లక్షల రూపాయల సాయం ప్రకటిస్తున్నాను. ఈ సంస్థకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి మొహాల్లో నవ్వులు చూడాలి. అన్నారు.
నట కిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు వారెన్ బఫెట్ తన సంపాదనలో ముప్పాతిక వంతు సహాయ కార్యక్రమాలకు ఇస్తున్నాడు. బిల్ గేట్స్ ఛారిటీలు చేస్తున్నాడు. మనం సైతం లాంటి సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ కు వాళ్లకు పెద్ద తేడా లేదు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ కు ఉన్నంత డబ్బుంటే కిరణ్ కూడా ఇచ్చేవారు. ఇంకా ఎక్కువ సేవ చేసేవారు. వీళ్లకు డబ్బు లేకున్నా గొప్ప మనసుంది. కిరణ్ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఆయన మనస్తత్వానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఊహించాను. మనం సైతం లో ప్రతి సభ్యుడు గొప్పవాడే. నా ఆస్తిలో కొంత వాటా ఈ సంస్థకు ఇవ్వాలనుకుంటున్నాను. అన్నారు.
సినిమా కథలు సుఖాంతం అయినట్లు...సినిమా కోసం పనిచేసే వాళ్ల జీవితాలు సంతోషంగా ఉండవు. ఇక్కడ పేరు ఉన్నంత వరకే అవకాశాలు. లేకుంటే ఆదుకునేందుకు ఎవరూ ఉండరు. ఇరవై నాలుగు విభాగాల్లో ఎవరికైనా ప్రమాదాలు జరగొచ్చు. అలాంటి వాళ్లకు అండగా నిలబడుతోంది మనం సైతం. నా వంతు సహాయాన్ని మా నాన్న ఈవీవీ పుట్టిన రోజున ప్రకటిస్తాను. ప్రతి ఏటా ఆ సహాయాన్ని అందజేస్తాను. అన్నారు.
ఈ సందర్భంగా మనం సైతం సభ్యుడు బందరు బాబీ సతీమణి ఆకుల కవిత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments