పేదల పెన్నిధిలా మనం సైతం...
Send us your feedback to audioarticles@vaarta.com
సాయం కోరిన పేదలను ఆదుకుంటున్న సేవా సంస్థ మనం సైతం తన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే పదిమందికి పైగా సహాయాన్ని అందిస్తూ గొప్ప మానవతను చాటుకుంటోంది. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ఈ సంస్థకు చిత్ర పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాల నుంచే కాక అగ్ర హీరోలు, దర్శకులు, నటీనటులు, ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల నుంచి మద్ధతు లభిస్తోంది. తాజాగా జరిగిన మనం సైతం సేవా కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, లక్ష్మారెడ్డి, ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, చంద్రవదన్, దర్శకుడు దేవీ ప్రసాద్, నటి ప్రగతి, గాయని కౌసల్య తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చొప్పున అతిథులు చేతుల మీదుగా మనం సైతం ఆర్థిక సాయం అందజేసింది. సాయం అందుకున్న వారిలో లైట్ మెన్ పి వెంకటేశ్వరరావు కొడుకు రాజు, డ్రైవర్ సత్యనారాయణ కుమారుడు సాయికుమార్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ విజయారావు, డ్రైవర్ వెంకటరాములు, పెండ్యాల వెంకటేశ్వరరావు, తడివేలు కూతురు నికిత (వివాహ ఖర్చులకు సాయం), జూనియర్ ఆర్టిస్టులు రామకృష్ణ, ఏ నరసింహులు, డీవీ రమణమూర్తి ఉన్నారు. అవసరార్థులకు చెక్ లు అందిచేసిన అనంతరం సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ....కాదంబరి కిరణ్ అంటే తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముడతాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వందల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. వాళ్లంతా కాదంబరిని చూసి నేర్చుకోవాలి. సమాజం పట్ల కాదంబరికి ఉన్న అంకితభావం గొప్పది. తన చుట్టూ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టాలకు ఉపశమనం కలిగించేలా సాయపడుతున్నాడు. వారికి ఆర్థిక ధైర్యాన్నిచ్చి మేమంతా ఉన్నా మీ వెనుక అంటూ మనం సైతం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థను ప్రారంభించినప్పుడు నా దగ్గరకు కాదంబరి వచ్చారు. అన్నా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా. చాలా మంది కష్టాల్లో ఉన్నారు. వాళ్లకు సాయం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. నాకున్న కొద్ది పరిచయాలతో, గుర్తింపుతో నేను కొంతమందికైనా సేవ చేయగలను అంటూ ధైర్యంగా కాదంబరి ముందుకొచ్చారు.
ఇవాళ మనం సైతం చేస్తున్న సహాయ కార్యక్రమాలు చూస్తుంటే సంతోషమేస్తోంది. చిన్నారులకు చదువులకు ఫీజులు కడుతున్నారు. అనారోగ్యం ఉన్న వాళ్లకు వైద్యం చేయిస్తున్నారు. ఇవాళ వైద్యం చాలా ఖరీదైంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు తయారవుతున్నాయి. మనం సైతం లాంటి గొప్ప సేవా సంస్థను తన భుజస్తంధాలపై వేసుకున్న కాదంబరినీ అతని బృందాన్ని అభినందిస్తున్నా. మనం సైతం సంస్థకు నా వంతుగా 5 లక్షల రూపాయలు అందిస్తున్నా. కాదంబరి దగ్గర కోట్ల రూపాయలు లేవు. సంపాదించుకున్నది ఇక్కడే పోగొట్టుకున్నాడు. కారణాలు ఏవైనా తనపై తనకు అపారమైన ధైర్యం ఉంది. తను ఎవరి దగ్గరకు వెళ్లినా కాదనరు అనే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాడు. మనం సైతం వెంట మేముంటాం అని తెలియజేస్తున్నా. మీ ద్వారా సమాజంలో ఆపన్నులకు చాలా మందికి మేలు జరుగుతుందని తెలుసు. కాదంబరి నేను చాలా సార్లు కలుస్తుంటాం. కానీ ఏ రోజూ నన్నూ ఏదీ తన కోసం అడగడు. మిగతా వాళ్లు కొద్దిపాటి పరిచయానికే ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తుంటారు. కాదంబరి అలాంటి వాళ్లకు భిన్నమైన వాడు. అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కాదంబరి కిరణ్ మనం సైతం సంస్థకు ధైర్యాన్ని ఇవ్వడానికి, నా వంతు సహకారం అందించేందుకు ఇక్కడి వచ్చాను. పేదలకు కాదంబరి అందిస్తున్న సాయం ధనరూపంలో చిన్నదైనా...స్థైర్యాన్ని ఇవ్వడంలో చాలా గొప్పది. ఆర్థిక సాయంతో పాటు మీకు ఏమైనా మేమున్నాం అండగా అంటూ మనం సైతం సభ్యులు భరోసా కలిగిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. ఇక్కడికొస్తున్న ఆపన్నులను చూస్తే 90 శాతం ఆరోగ్య సమస్యలతోనే వస్తున్నారు. పేద ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజావైద్యం విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయి. కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం.
కేసీఆర్ కిట్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం సైతం ద్వారా కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతోమందికి సాయం అందిస్తున్నారు. నా వంతుగా నేనూ ఈ సంస్థకు సహకారం అందిస్తాను. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో మనం సైతం నుంచి ఎవరికి నా సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని తెలియజేస్తున్నాను. అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.... పేదరికాన్ని రూపుమాపడం ఎవరివల్లా కాదు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసా కలిగించాలి అనే తపనతో ఈ సేవా సంస్థను మొదలుపెట్టాను. మనం సైతంను ఆశ్రయించిన వాళ్లందరికీ వాళ్ల పరిస్థితి తీవ్రతను బట్టి ఆర్థిక సాయం చేస్తున్నాం. మమ్మల్ని ఎవరైనా సంప్రదించగానే వాళ్ల వివరాలతో సహా వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తాను.
వెంటనే నా స్నేహితులంతా తలా వెయ్యి రూపాయలు సాయం ప్రకటిస్తారు. అవి పదిహేను దాకా వచ్చి ఆగిపోతాయి. అప్పుడు మనం సైతం ట్రస్టు నుంచి మరో 15, 20 వేలు వాటికి కలిపి అవసరంలో ఉన్న పేదలకు అందించి ధైర్యాన్ని కలగజేస్తున్నాం. కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటే ఎవరూ దగ్గరకు రానీయరు అనుకునేవాడిని. కానీ ఈ పెద్దలందరి దగ్గరకు మనం సైతం కోసం నేను వెళ్తున్నప్పుడు వాళ్లు చూపిస్తున్న ఆదరణ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపిస్తోంది. మరింత మందికి సేవ చేయొచ్చనే ధైర్యం కలుగుతోంది.
మా దగ్గరకు వచ్చి సాయం పొందిన వాళ్లకూ మన కష్టాలు చెప్పుకోవచ్చు అనే భరోసా ఏర్పడుతోంది. నాకు అండగా నిలుస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. గతేడాది దాదాపు 150 మంది పేదలకు సాయం అందించాం. నాకున్న కొద్దిపాటి గుర్తింపుతో వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరిగితే దాదాపు 43 లక్షల రూపాయల ఫీజులు మన పేదవాళ్ల కోసం తగ్గించారు. మా డబ్బులు పదిహేను లక్షల రూపాయలు ఖర్చుచేశాం. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస అన్న, లక్ష్మారెడ్డి గారు రావడం మాకెంతో ధైర్యాన్నిస్తోంది. తలసాని అన్న మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. లక్ష్మారెడ్డి అన్నగారు మంత్రిగా తీరిక లేకుండా ఉన్నా మేము ఎప్పుడు ఎవరికి సాయం చేయాలని అడిగినా వెంటనే స్పందిస్తుంటారు. తన వాళ్లతో చెప్పి ఆ ఆస్పత్రులకు ఫోన్లు చేయిస్తుంటారు. ఆయన మనం సైతంకు అందించిన ధైర్యం చాలా గొప్పది. అన్నారు.
మనం సైతం సభ్యులు బందరు బాబీ మాట్లాడుతూ.... మన సైతంకు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, లక్ష్మారెడ్డి వంటి పెద్దల తోడ్పాటు ఎంతో అవసరం. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని గారు మా కార్యక్రమానికి రావడం, సంస్థకు అండగా నిలబడటం సంతోషంగా ఉంది. మంత్రి లక్ష్మారెడ్డి గారి వల్ల మనం సైతంకు చాలా సహకారం అందుతోంది. మా దగ్గరకు వచ్చే ఫైల్స్ లక్ష్మారెడ్డి గారి కృషితో ముందుకు వెళుతున్నాయి. మనం సైతం కోసం కాదంబరి అన్న తన వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలి శ్రమిస్తున్నారు. పరిశ్రమలో పేదవాళ్ల కోసం పెద్ద వాళ్ల దగ్గరకు వెళుతున్నారు. అవసరమైతే వాళ్ల కాళ్లు పట్టుకుని అయినా పని సాధించుకుంటున్నారు.
మనం సైతంకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు. ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు వల్లభనేని అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments