పండుగ పూట విషాదం.. పొట్టేలు తల అనుకుని మనిషిని
- IndiaGlitz, [Monday,January 17 2022]
సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. మూడు రోజుల పెద్ద పండుగను ఆత్మీయులు, బంధుమిత్రులతో జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా సరదాగా గడిపారు. దీంతో తెలుగు లోగిళ్లు పండుగ శోభతో కళకళలాడాయి. ఇక కనుమ పండుగ కావడంతో పశువులను పూజించి , గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. మద్యం మత్తులో పొట్టేలు తల అనుకుని మనిషి తల నరికేశాడో వ్యక్తి.
వివరాల్లోకి వెళితే.. మదనపల్లె సమీపంలో వలసపల్లెలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి గ్రామస్థులంతా రాత్రి ఏలుబోనాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకురాగా.. అదే గ్రామానికి చెందిన చలపతికి నరికే బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న చలపతి పొట్టేలును కదలకుండా పట్టుకున్న అదే గ్రామానికి చెందిన సురేష్ తలను నరికేశాడు.
ఈ నేపథ్యంలో సురేష్ అక్కడే కుప్పకూలిపోగా.. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఈ ఘటన పొరపాటున జరిగిందా.. లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట అమ్మవారి సన్నిధిలో నిండు ప్రాణం పోవడంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.