భార్యను చంపి అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడిపాడు.. కానీ కథ అడ్డం తిరిగింది
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లయిన రెండు నెలలకే భార్యను హతమార్చి తన పైకి కేసు రాకుండా పెద్ద స్కెచ్చే వేశాడు. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపాడు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమాల నవ్యారెడ్డి(20) సత్తుపల్లి సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. కాగా.. డిసెంబర్ 2020లో ఆమె వివాహం.. తన మేన బావ అయిన నాగశేషురెడ్డితో జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 2న తన భార్యకు జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపిచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు.
హత్యానంతరం నవ్యారెడ్డి మొబైల్ నుంచి ఆమె తండ్రికి మంచి స్టోరీ అల్లి మెసేజ్ చేశాడు. తనకు ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మెసేజ్ పెట్టి ఏమీ ఎరుగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం 3వ తేదీన తన భార్య కనిపించడం లేదని.. క్రితంరోజు సత్తుపల్లి సమీపంలోని కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని నాగశేషురెడ్డి పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో నవ్యారెడ్డి 2వ తేదీన నాగశేషుతో కలిసి బైక్‌పై వెళ్లిన దృశ్యాలు పెనుబల్లి మండలంలోని కుప్పెనగుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కనిపించాయి.
ఈ క్రమంలోనే పోలీసులకు అనుమానం రావడంతో.. నాగశేషును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు అసలు నిజం కక్కేశాడు. ఈ నెల 2వ తేదీన నవ్యకు జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపిచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లానని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చున్నీతో చెట్టుకు ఉరి వేసినట్టు వెల్లడించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. కాగా.. నాగశేషుకు వేరే యువతితో ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నవ్య బంధువులు ఆరోపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments