సీఎంగా మమత ప్రమాణ స్వీకారం.. పదవిలో కొనసాగాలంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా నిరాడంబరంగా జరిగింది. మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. మమతా బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మమత సీఎం పదవిలో కొనసాగాలంటే..
నిజానికి మమత నందిగ్రాంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి అధికారి సువేంద్ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఆమె సీఎంగా కొనసాగాలంటే రెండు దార్లున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఒకటి.. లేదంటే ఏదైనా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేను తొలగించి ఆమె అక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో శాసన మండలి లేదు కాబట్టి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం మమతకు లేదు. దీంతో సీఎం పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా తప్పనిసరిగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సి ఉంటుంది. తమ పార్టీ బలంగా ఉండే స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఇందుకు గాను పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆ స్థానంలో మమత పోటీ చేయొచ్చు. లేదంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖర్దాహా నుంచి పోటీకి నామినేషన్ వేసిన అనంతరం మృతి చెందిన టీఎంసీ నేత కాజల్ సిన్ స్థానంలో మమత బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉంది. లేదంటే అభ్యర్థుల మృతితో వాయిదా పడ్డ జంగీపుర్, శంషేర్‌గంజ్ స్థానాల నుంచి ఆమె పోటీ చేయొచ్చు.
మమత రాజకీయ ప్రస్థానం..
1955 జనవరి 5న జన్మించిన మమత బెనర్జీ తన తండ్రి ప్రోత్సాహంతో విద్యార్థినిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో చేరి రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. 1984లో జాదవ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. 1991లో మరోసారి విజయం సాధించి.. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 1997లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి వరకూ పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న వామపక్ష పార్టీలను సైతం ఓడించి 2011లో మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments