మోదీకి స్వీట్లిచ్చింది నిజమే.. కానీ.. : స్ట్రాంగ్ కౌంటరిచ్చిన దీదీ
- IndiaGlitz, [Thursday,April 25 2019]
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల్లో మీకు ఎవరితో మంచి సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రశ్న ఎదురవ్వగా.. ఆయన సమాధానమిచ్చారు. అంతేకాదు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీ ఏటా తనకు దుస్తులు, మిఠాయిలు పంపిస్తారని మోదీ చెప్పారు. దీంతో ఎప్పుడూ మోదీ అంటే ఒంటికాలిపై లేచి మోదీని తాను ప్రాణంతో ఉండగా ప్రధానిని కానివ్వనని పలుమార్లు చెప్పిన దీదీ ఇలా నిజంగానే చేశారా..? అని అందరూ ఆశ్చర్యపోయారు.
ఒక్క ఓటు కూడా..!
అయితే ఈ వ్యవహారంపై తాజాగా.. మమతా స్పందిస్తూ మోదీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఎస్.. నేను స్వీట్లిచ్చిన మాట వాస్తవమే. స్వీట్లిస్తానే గానీ.. ఓట్లివ్వను. స్వీట్లతో.. ‘టీ’తో అతిథులకు స్వాగతం పలకడం బెంగాలీ సంప్రదాయం. ప్రత్యేక సందర్భాల్లో కూడా అలాగే స్వీట్లిస్తాం. అంతేతప్ప బీజేపీకి ఒక్క ఓటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని తేల్చిచెప్పారు.
మోదీపై దీదీ సెటైర్లు..
అంతటితో ఆగని దీదీ.. కొందరికి తాను రసగుల్లాలు కూడా పంపిస్తుంటానని చెప్పుకొచ్చారు. వేడుకలు, ప్రత్యేక పూజల సమయంలో కానుకలు పంపుతుంటా కానీ వారికి ఒక్క ఓటు కూడా దక్కనివ్వనని స్పష్టం చేశారు. బెంగాల్‌లో మోదీ జిత్తులు సాగవని.. ఎన్నికల తర్వాత మోదీని బయటకు నెట్టేస్తారని దీదీ జోస్యం చెప్పారు.