మామ మంచు - అల్లుడు కంచు మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,December 25 2015]

తారాగ‌ణం - మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, రాజా రవీంద్ర‌ తదితరులు

సంగీతం - కోటి, రఘుకుంచె, అచ్చు

కెమెరా - బాలమురుగన్

ఎడిటింగ్‌ - గౌతంరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ కుమార్

మాట‌లు - శ‌్రీధ‌ర్ సీపాన

నిర్మాణం - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీప్రసన్న పిక్చర్స్

సమర్పణ - అరియానా, వివియానా, విద్యానిర్వాణ

నిర్మాత – విష్ణు మంచు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాస రెడ్డి

ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మామ మంచు అల్లుడు కంచు. రెండు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన అల్ల‌రి మొగుడుకు సీక్వెల్ లా ఉంటుందీ సినిమా. హీరోకి పెళ్ళ‌య్యే స‌న్నివేశంతో అల్ల‌రి మొగుడు పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత అత‌నికి పిల్ల‌లు పుట్టాక ఏమైంద‌నే అంశంతో తాజా సినిమా మొద‌లవుతుంది. మ‌రాఠీ సినిమా హ‌క్కుల‌ను కొనుక్కుని తెలుగుకు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పుల‌ను చేసి ఈ సినిమాగా తెర‌కెక్కించారు. త‌న 50వ సినిమాగా అల్ల‌రి న‌రేష్ చెప్పుకునే సినిమా అయిందా అని ప‌లువురి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఘ‌డియ‌ల‌కు స‌మాధాన‌మే శుక్ర‌వారం విడుద‌లైన మామ మంచు అల్లుడు కంచు.

క‌థ‌

భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు (మోహ‌న్‌బాబు) బిజినెస్ మేన్‌. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు. మొద‌టి భార్య మీనా. రెండో భార్య ర‌మ్య‌కృష్ణ‌. పూర్ణ‌, వ‌రుణ్ సందేశ్ ఆయ‌న పిల్ల‌లు. పిల్ల‌లు ఇద్ద‌రికీ ఒకేరోజు పుట్టిన‌రోజు రావ‌డంతో వారిద్దరికీ జువెల‌రీ షాపులో బ‌హుమ‌తుల‌ను కొంటాడు. కానీ అత‌ని వ్య‌వ‌హారాల‌న్నీ తెలిసిన అలీ చేసిన పొర‌పాటు వ‌ల్ల గిఫ్ట్ లు మారిపోతాయి. వెంట‌నే భ‌క్త‌వ‌త్స‌లం వార‌సులు ఇద్ద‌రూ జువెల‌రీ షాపుకు ఫోన్ చేసి ఒక‌రి నెంబ‌ర్ల‌ను ఒక‌రు తీసుకుంటారు. వారి మ‌ధ్య ఫోన్ ప‌రిచ‌యాలు మొద‌ల‌వుతాయి. అయితే ఆ ప‌రిచ‌యం కాస్తా ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి ఆక‌ర్ష‌ణ‌గా మారితే జ‌రిగే అన‌ర్థాల‌ను ఊహించుకుంటాడు భ‌క్త‌వ‌త్స‌లం. ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అలీ సాయంతో న‌రేష్‌ని క‌లుసుకుంటాడు. అయితే న‌రేష్ నిజంగానే పూర్ణ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు వ‌రుణ్‌సందేశ్‌కి కూడా ల‌వ‌ర్ ఉంటుంది. ఇద్ద‌రి పిల్ల‌ల పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి కుద‌ర‌డంతో మ‌రోసారి భ‌క్త‌వ‌త్స‌లానికి టెన్షన్ మొద‌ల‌వుతుంది. స‌ర‌దాగా మొద‌లైన మామా అల్లుడు వ్య‌వ‌హారం, ఓ సంద‌ర్భంలో ఎలా ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకునేంత ఆత్మీయంగా మారుతుంది. అది ఎలా అనేదే మ‌లిస‌గం సినిమా.

ప్లస్ పాయింట్స్

నలబై వసంతాల నటజీవితంలో మోహన్ బాబు చేయని పాత్ర లేదు. కాబట్టి ఈ పాత్రను కరతళమలకంగా చేసేశారు. ఇద్దరు భార్యల ముద్దుల మొడుగుగా 23 సంవత్సరాల క్రితం అల్లరి మొగుడులో ఎంటర్ టైన్ చేసిన విధంగానే ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్ చేశారు. నరేష్ తనదైన కామెడి టైమింగ్ తో నవ్వించాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలీ పాత్ర గురించి అలీ కూడా మోహన్ బాబు ఫ్రెండ్ పాత్రలోనే కాకుండా భక్తవత్సలం నాయుడు పాత్రలో కనిపించి తనదైన కామెడితో ఆకట్టుకున్నాడు. మరాఠి రీమేక్ ను తెలుగు నెటివిటీకి తగిన విధంగా రీమేక్ చేయడంలో టీం సక్సెస్ అయింది. ఒకరి క్యారెక్టర్ ను ఒకరు డామినేట్ చేసేలా కాకుండా సినిమా సాఫీగా వెళ్ళిపోతుంది. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్లు

సినిమాను చూస్తున్నంత సేపు పాత క‌థ‌గా అనిపిస్తుంది. పోనీ క‌థ‌నంలో కొత్త‌ద‌న‌ముందా? అంటే అదీ క‌నిపించ‌దు. డైలాగులు పేల‌వంగా ఉన్నాయి. పాట‌లు కూడా ట్రెండీగా లేవు. మీనా పాత్ర‌పై పెట్టిన దృష్టి రమ్య‌కృష్ణ పాత్ర‌పై పెట్టిన‌ట్టు అనిపించ‌దు. క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ కూడా లేదు. డ‌మ‌రుకంతో డిజాస్ట‌ర్ ఫ్లాప్‌ను తెచ్చుకున్న శ్రీనివాస‌రెడ్డి ఈ సినిమా విష‌యంలోనూ స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడు. అనుభ‌వ‌మున్న న‌టీన‌టుల్ని చేతిలో పెట్టుకుని స‌రైన న‌ట‌న‌ను రాబ‌ట్టుకోలేక‌పోయారు. ఏ పాత్రా, ఏ స‌న్నివేశం హృద‌యానికి తాక‌దు. మోహ‌న్‌బాబు లేకుంటే ఆ సినిమాలో చెప్పుకోవ‌డానికి ఇంకేమీ లేవు. పాట‌లు కూడా బోరింగ్‌గా అనిపిస్తాయి. పూర్ణ లావుగా వ‌దిన పాత్ర‌ల‌కు స‌రిపోయేలా ఉంది. సైడ్ ఆర్టిస్టుకి స‌రిపోయే పూర్ణ‌ని పాట‌ల్లో ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. చాలా ల్యాగ్‌లు ఉన్న‌ట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బావుండేది.

విశ్లేషణ

మోహన్ బాబు సినిమా కాబట్టి ఆయన్ను మళ్ళీ తెరపై చూడాలనుకునేవారికి ఓకే అయితే మోహన్ బాబు స్టయిల్ ఆఫ్ విరుపులుండే డైలాగ్స్ కనపడవు. అలాగే అల్లరి నరేష్ కామెడి పాత్రలో బాగా చేశాడు. కానీ ఇరగబడి నవ్వేంత కామెడి మనకు కనపడదు. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి కథనం విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేదనిపించింది. సినిమా కామెడి బేస్ మూవీ అయినా కామెడికి పెద్దగా నవ్వురాదు. సినిమాకు మ్యూజిక్ పరంగా పెద్ద తోడ్పాటు లభించలేదు. అయతే మోహన్ బాబు స్టయిల్ ఆఫ్ డైలాగ్స్. నటనను చూడాలనుకునేవారు సినిమాను ఎంజాయ్ చేయవచ్చు

బాటమ్ లైన్

మామ మంచు- అల్లుడు కంచు' సింపుల్ కామెడి ఎంటర్ టైనర్

రేటింగ్: 2.5/5

English Version Review