తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
- IndiaGlitz, [Sunday,March 20 2022]
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్వరాజ్యం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు స్వరాజ్యం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు నిర్వహించేవారు. అలాగే ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పాటలతో, ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్యపరిచారు మల్లు స్వరాజ్యం. ఆమె తలపై అప్పటి నిజాం సర్కార్ 10 వేల రూపాయల రివార్డు ప్రకటించినా స్వరాజ్యం చిక్కలేదు.
ఇక స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు స్వరాజ్యం ఎమ్మెల్యేగా పని చేశారు. వీరికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యుడు), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) . కుమార్తె కరుణ బీజేపీలో ఉండగా.. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా కొనసాగుతున్నారు.