ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు పరిశ్రమల్లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. పలు రంగాల్లో తమ కంటూ ప్రతేకతను సాధించిన వ్యక్తుల జీవితాలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని ఆదరణ పొందలేదు. జయాపజయాలకు అతీతంగా బయోపిక్‌లు చాలానే వస్తున్నాయి. అలా తెలుగులో రూపొందిన బయోపిక్ `మల్లేశం`. చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటి వరకు కమెడియన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియదర్శి తొలిసారి లీడ్ పాత్రలో నటించిన చిత్రం కూడా ఇదే. మరి `మల్లేశం` ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకున్నాడు? ప్రియదర్శి లీడ్ యాక్టర్‌గా ఆకట్టుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ:
నల్గొండ జిల్లాలోని కుగ్రామంలో చింతకింది మల్లేశం కుటుంబం చేనేత వృత్తితో జీవనం కొనసాగిస్తుంటారు. పేదరికం కారణంతో తండ్రి 6వ తరగతి తర్వాత మల్లేశాన్ని చదువు మాన్పించి చేనేత పని చేయిస్తాడు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న మల్లేశం కూడా తల్లిదండ్రులకు ఎదురు చెప్పడు. చేనేత మగ్గం కోసం ఆసు పని చేసే తల్లి లక్ష్మి(ఝాన్సీ) చెయ్యి నొప్పితో బాధపడుతుంటుంది. తల్లి నొప్పి పొగొట్టాలంటే ఏం చేయాలనే ఆలోచన మల్లేశంలో చిన్నప్పుడే మొదలవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. పెరిగి పెద్దయిన తర్వాత స్నేహితుల సహకారంతో ఆసుయంత్రాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు మల్లేశం. అయితే ప్రయత్నం సఫలం కాదు. అదే సమయంలో తన మామ కూతురు పద్మ(అనన్య)ను ప్రేమించి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. భార్య పద్మ కూడా మల్లేశాన్ని అర్థం చేసుకుని అతనికి సహకారాన్ని అందిస్తుంది. కానీ మల్లేశం ప్రయత్నాలు ఫలించవు. దాంతో అందరూ మల్లేశాన్ని పిచ్చోడు అని గేలి చేస్తుంటారు. చివరకు భార్యతో కలిసి పట్నం వెళ్లిపోతాడు. అక్కడ మల్లేశం ఏం చేశాడు? ఆసు యంత్రాన్ని ఎలా కనుగొన్నాడు? పట్నంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
బయోపిక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే.. ముందుగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే నటీనటులు కావాలి. `మల్లేశం` విషయంలో పరమితమైన పాత్రలే ఉన్నా.. ఆ పాత్రను పోషించిన నటీనటులు అద్భుతంగా నటించారు. టైటిల్ పాత్రలో నటించిన ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు కమెడియన్‌గా ముద్ర పడిన ఆయన, లీడ్ పాత్రలో నటించడం, అందులోనూ బయోపిక్‌లో నటించడం గొప్ప విషయమే. నటన పరంగా సరికొత్త ప్రియదర్శినిని చూడొచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా ఉండే సమయంలో, ప్రేమ సన్నివేశాల్లో, ఆసు యంత్రాన్ని కనుగొనే సన్నివేశాల్లో ఉండే ఎమోషన్స్‌ను క్యారీ చేసే సందర్భాల్లో చక్కటి నటనను కనపరిచాడు. ఇక హీరోయిన్ అనన్య కూడా చక్కగా నటించింది. మంచి హావభావాలను పలికించింది. సెకండ్ హాప్‌లో సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌ను ఆమెనే క్యారీ చేసిందనాలి. ఇక మల్లేశం తల్లి లక్ష్మి పాత్రలో ఝాన్సీ అద్భుతమైన పెర్ఫామెన్స్‌ను ప్రదర్శించింది. అలాగే తండ్రి పాత్ర చేసిన చక్రపాణి కూడా పాత్రను చక్కగా పోషించారు. ఇక తాగుబోతు రమేష్, ప్రియదర్శి స్నేహితులు అందరూ చక్కగా నటించారు.
సాంకేతికంగా చూస్తే బయోపిక్స్‌ను తీయడం అంత సులువు కాదు.. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. డైరెక్టర్ రాజ్.ఆర్ సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. అయితే ఎమోషన్స్ విషయంలో మరింత బలమైన ఎమోషన్స్‌ను తెరకెక్కించలేదు. సినిమాలో పాత్రలతో పాటు ప్రేక్షకుడు ట్రావెల్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మార్క్ కె.రాబిన్ సంగీతం, నేపథ్య సంగీతం బావుంది. ఆసుయంత్రం పై సాంగ్, పల్లెటూరి నేపథ్యాల్లో వచ్చే సాంగ్స్ అన్నీ బావున్నాయి. బాల శాండిల్యస సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు కథానుగుణంగా ఉన్నాయి. అయితే సినిమా స్లోగా సాగుతున్న భావన కలుగుతుంది. సినిమాలో ఎమోషన్స్ హైగా అనిపించవు. సినిమాను ఓ సింపుల్‌ఫ్లోలో తీసుకెళ్లిపోయిన భావన కలుగుతుంది.
బోటమ్ లైన్:
మల్లేశం.. ఆకట్టుకునే బయోపిక్.. అయితే సినిమాలో ఎమోషనల్ శాతం తగ్గింది.. ఇంకా బాగా తెరకెక్కించి ఉండొచ్చు
Comments