Mallareddy: మల్కాజిగిరి ఎంపీగా పోటీచేయలేం.. కేసీఆర్‌కు తేల్చి చెప్పేసిన మల్లారెడ్డి..
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారనే వార్తలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని.. మీవెంటే నడుస్తానని కేసీఆర్‌కు స్పష్టంచేశారు. అయితే మల్కాజిగిరి ఎంపీగా తన కుమారుడు పోటీ నుంచి తప్పుకుంటున్నారని తెలిపారు. కాగా మల్కాజిగిరి ఎంపీగా తన కొడుకు పోటీ చేయనున్నారని మల్లారెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. దుండిగల్‌లో ఉన్న దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లోని 6 ఎకరాల్లో ఆయన కాలేజీలకు చెందిన రెండు శాశ్వత భవనాలను, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేశారు. చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించి కూల్చివేయడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ అయి సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే మామా అల్లుళ్లు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరున్నారనే ప్రచారం జోరందుకుంది. కానీ తాము బీఆర్ఎస్ పార్టీని వీడమని తెలిపారు. అయితే మల్కాజిగిరి ఎంపీ పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే మరింతగా వేధింపులు పెరుగుతాయని మల్లారెడ్డి కుటుంబం ఆందోళనతో ఉన్నట్లు సమాచారం. అందుకే పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మల్లారెడ్డి కుటుంబానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలను కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష ఎంపీ రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేశారు.
ఇప్పుడు రేవంత్ సీఎం కావడంతో మల్లారెడ్డి కుటుంబానికి చెందిన అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు. దీంతో గులాబీ పార్టీ తరపున పోటీ చేస్తే ప్రభుత్వం నుంచి వేధింపులు ఎక్కువ కావడం ఖాయమని అంచనాకు వచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి పాత వైరం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌కి మల్లారెడ్డి వార్నింగ్ ఇస్తూ తొడకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోటీకి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout