Mallareddy:కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుతో భేటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్, బీజేపీలు సత్తా చాటడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీ మారగా.. తాజాగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy) కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. త్వరలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన కుమారుడిని మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు. మరోవైపు దుండిగల్‌లో ఉన్న దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లోని 6 ఎకరాల్లో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు చెందిన రెండు శాశ్వత భవనాలను, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేశారు. చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించి కూల్చివేయడం జరిగింది. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
ఇటీవలే గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా ఆ రోడ్డును తొలగించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని.. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆయన మండిపడ్డారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో పనిచేశారు. ఇద్దరు మల్కాజిగిరి ఎంపీలుగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాల దృష్ట్యా రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం మల్లారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి కేసీఆర్ కేబినెట్లో చోటు కూడా దక్కింది. అటు కాంగ్రెస్‌లో చేరిన రేవంత్.. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకనొక సమయంలో మల్లారెడ్డి తొడ కొట్టి రేవంత్‌కు ఛాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని మల్లన్న భావిస్తున్నారట. మరి ఊహించని విధంగా హస్తం కండువా కప్పుకుంటారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com