Mallareddy: కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు.. డీకే శివకుమార్‌ను అందుకే కలిశా: మల్లారెడ్డి
- IndiaGlitz, [Thursday,March 14 2024]
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. దీంతో ఆయన కుటుంబం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీనిపై మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని.. వ్యాపార పనుల నిమిత్తం ఆయనను కలిసినట్లు స్పష్టంచేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. ఈ అయిదేళ్లు మాత్రమే ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడే భాష సరిగా లేదన్నారు. మీ అంతు చూస్తా... మీ కాలేజీలు మూసేస్తా... వీళ్లేమనుకుంటున్నారు... ఒరేయ్ మల్లిగా... ఇలాగేనా మాట్లాడేది? అని మండిపడ్డారు. ఆయన ఏమైనా పెద్ద బాస్ అనుకుంటున్నాడా? అని ఫైర్ అయ్యారు.
కాగా ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసింతే. దుండిగల్ చెరువును ఆక్రమించి భవనాలుకట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చేశారు. అలాగే మల్లారెడ్డికి చెందిన కాలేజీల్లో అక్రమంగా నిర్మించిన రోడ్లను కూడా కూల్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే మల్లారెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విషయంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
దీంతో రూట్ మార్చిన మల్లారెడ్డి.. కాంగ్రెస్ పెద్దల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తాను పార్టీ మారడం లేదని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి మల్లారెడ్డి ప్రయత్నాలు ఫలించి ఆయనను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..? లేక స్థానిక నేతల ఒత్తిడికి తలొగ్గి పక్కన పెడతారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.