ఆ రెండు చిత్రాల వలే మహిళ ప్రేక్షకులను ఆకట్టుకునే విభిన్న కథా చిత్రం నాగభరణం - నిర్మాత మల్కాపురం శివకుమార్
- IndiaGlitz, [Thursday,October 13 2016]
అమ్మోరు, దేవి, అరుంధతి..ఇలా గ్రాఫిక్స్ మాయాజాలంతో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా కోడి రామకృష్ణ తాజాగా కన్నడలో తెరకెక్కించిన చిత్రం నాగరహవు. ఈ చిత్రాన్ని తెలుగులో నాగభరణం అనే టైటిల్ తో అనువదించారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ నాగభరణం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు,తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నాగభరణం చిత్రం ఈనెల 14న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ చిత్రాన్ని మీరు రిలీజ్ చేస్తుండడం ఎలా ఫీలవుతున్నారు..?
అమ్మోరు, దేవి, దేవుళ్లు, అరుంధతి...ఇలా గ్రాఫిక్స్ మాయాజాలంతో సినిమాలు తెరకెక్కించి ఎన్నో ప్రయోగాలు చేసారు... సక్సస్ అయ్యారు. ఇప్పుడు మరి కొంత ముందుకు వెళ్లి ఓ అద్భుతం సృష్టించారు. అలాంటి అద్భుత చిత్రాన్నినేను రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
నాగభరణం చిత్రాన్ని మీరు తెలుగులో రిలీజ్ చేయాలి అనుకోవడానికి కారణం ఏమిటి..?
ఈ మూవీ టీజర్ చూసాను నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు ఈ మూవీని కోడి రామకృష్ణ గారు తీస్తున్నారని తెలియదు. టీజర్ బయటకు వచ్చిన తర్వాత ఈ మూవీ పై క్రేజ్ పెరిగింది. ఈ మూవీ రీ రికార్డింగ్ టైమ్ లో కొన్ని సీన్స్ చూసిన తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో నేను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మా సంస్థలో సూర్య వెర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా నాగభరణం అనే సినిమాను అందిస్తున్నాను.
నాగభరణం టీజర్ ఓ సన్సేషన్ క్రియేట్ చేసింది కదా..! టీజర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది..?
అవును...నాగభరణం టీజర్ రిలీజైన 48 గంటల్లో 50 లక్షల వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. చనిపోయిన లెజండరీ ఏక్టర్ విష్ణువర్ధన్ ను తెర పై ఆవిష్కరించడం అంటే ఓ సాహసం అనే చెప్పచ్చు. విజువల్స్ లో విష్ణువర్ధన్ ను చూసినప్పుడు అద్భుతం అనిపించింది. ఈగ, బాహుబలి చిత్రాలకు వర్క్ చేసిన మకుట సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ తో విష్ణువర్ధన్ గార్ని తెర పై ఆవిష్కరించింది.
నాగభరణం హైలెట్స్ ఏమిటి..?
ఈ చిత్రానికి హైలెట్ అంటే ముందు చెప్పుకోవాల్సింది విజువల్ ఎఫెక్ట్స్. ఆడియోన్స్ ను ఈ విజువల్స్ థ్రిల్ కలిగించేలా ఉంటాయి. కోడి రామకృష్ణ గారి సినిమాలు అన్నీ మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అమ్మోరు, అరుంధతి చిత్రాల వలే ఈ సినిమా కూడా ఖచ్చితంగా మహిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాని ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు..? ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారు..?
ప్రస్తుతం నాగభరణం చిత్రాన్ని 450 నుంచి 500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ తర్వాత మరిన్ని థియేటర్స్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇక ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అంటే...టీజర్ కు వచ్చినట్టే...సినిమాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.