Malavika Nair :ఓ మంచి అనుభూతినిచ్చే చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' - మాళవిక నాయర్

  • IndiaGlitz, [Monday,March 13 2023]

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయిక మాళవిక నాయర్ సోమవారం విలేఖర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రయాణం ఎలా ఉంది?

ట్రైలర్ మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. నటిగా నేను ఎవరనేది చూపించే చిత్రమిది. ఇప్పటిదాకా ఒక నటిగా సినిమాలు చేశాను.. నటిగా ఏం చేయాలో అంతవరకే చేశాను. కానీ ఇది అన్ని విభాగాల పరంగా నాకు దగ్గరైన సినిమా. శ్రీనివాస్ గారి లాంటి ప్రతిభగల దర్శకుడితో పని చేయడం సంతోషం కలిగించింది. ఆయన అమెరికా వెళ్లి ఎంతో సాంకేతిక నేర్చుకొని ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు చేయడం అభినందించదగ్గ విషయం. ఆయనకు భాషపై మంచి పట్టు, గౌరవం ఉన్నాయి. ఆయన వల్లే నా తెలుగు మెరుగుపడింది.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' కథ ఎలా ఉండబోతోంది?

మామూలుగా ప్రేమ కథలు రెండు మూడేళ్ళ వ్యవధిలో జరిగినట్లు చూపిస్తుంటారు. అయితే ఇందులో 18 నుంచి 28 ఏళ్ల వరకు ప్రయాణం చూపిస్తారు. మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. వయసును బట్టి నాగ శౌర్య పాత్ర తాలూకు వైవిధ్యాన్ని చక్కగా చూపించారు. నేను కూడా నా పాత్రకు పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నాను.

ఈ సినిమా కథ మీ నిజ జీవితానికి దగ్గరగా ఏమైనా ఉందా?

నేను పోషించిన అనుపమ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఏముండదు. నాగ శౌర్య పోషించిన సంజయ్ పాత్ర మాత్రం కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే పాత్రలు, సన్నివేశాలు సహజంగా నిజ జీవితంలో మనకు ఎదురైనట్లుగా ఉంటాయి.

నాగశౌర్య గారు ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు.. ఈ సినిమా రీమేక్ చేసినా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేరు అన్నారు.. అంతలా సినిమాలో ఏముంది?

అలా ఎందుకు అన్నారో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో అసలు అక్కడ ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది అనేది దర్శకుడికి, డీఓపీకి, నటీనటులకు అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే శౌర్య అలా అని ఉంటారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు.

ఇది రెగ్యులర్ సినిమానా? ప్రయోగాత్మక చిత్రమా?

ప్రయోగమే. రెగ్యులర్ సినిమా అనలేను. అలా అని మనకి తెలియని భావోద్వేగాలు కాదు. చూస్తున్నంత సేపు ఓ మంచి అనుభూతి కలుగుతుంది.

ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ బాబీ గారు మీ కళ్ళు బాగున్నాయి అని చెప్పడం ఎలా అనిపించింది?

ఆనందం కలిగించింది. గతంలో కూడా కొందరు దర్శకులు కళ్ళు బాగుంటాయి అని ప్రశంసించారు. మా అమ్మ కళ్ళు కూడా అలాగే ఉంటాయి. అవే నాకు వచ్చాయి.

ఒక కమర్షియల్ సినిమాని నేచురల్ గా తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?

ఏం చేసినా ప్రేక్షకులకు మెప్పించగలిగేలా తీస్తే చాలు. ఇందులో సందేశాలు ఇవ్వడంలేదు. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో స్వచ్ఛమైన వినోదాన్ని పంచబోతున్నాం.

ఈ సినిమా పరంగా నటిగా మీరు సంతృప్తి చెందారా?

చాలా సంతృప్తిగా ఉంది. 18 నుంచి 28 ఏళ్లు.. ఈ పదేళ్ల ప్రయాణంలో మనలో ఎన్నో మార్పులు వస్తాయి, మన ఆలోచనా విధానం మారుతుంది. మన భావోద్వేగాలు మారుతుంటాయి. అందుకే నా పాత్రలో నటనకి ఎంతో ఆస్కారం ఉంది.

నాగశౌర్య గురించి చెప్పండి?

నాగశౌర్య తన చుట్టూ ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఎవరైనా బాధగా ఉంటే వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. షూటింగ్ సమయంలో ప్రతి షాట్ అవ్వగానే ఎలా చేశాను, ఇంకా ఏమైనా చేయాలా అని దర్శకుడు శ్రీనివాస్ గారిని అడుగుతుంటారు.

ఈ సినిమాలో ముద్దు సన్నివేశానికి మీరు అభ్యంతరం చెప్పలేదా?

అది నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సన్నివేశం కాదు. కథలో భాగమైన, కథకి అవసరమైన సన్నివేశం.

నటిగా ప్రతిభ ఉన్నా, విజయాలు ఉన్నా.. మీకు అనుకున్న స్టార్డమ్ రాలేదనే అభిప్రాయముందా?

అలా ఏం ఆలోచించలేదు. నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అనుకోవట్లేదు. కథ, పాత్ర నచ్చితే అన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల గురించి చెప్పండి?

ఆయన చాలా సరదాగా ఉంటారు. ఏమున్నా మనసుని నొప్పించకుండా ముఖం మీదే సున్నితంగా చెప్పేస్తారు. ఆయన నటీనటుల మ్యానరిజమ్స్ మీద దృష్టి పెట్టరు. ఎమోషన్స్ రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు.

చిత్ర నిర్మాతల గురించి చెప్పండి?

వివేక్ గారితో ఇది నాకు రెండో సినిమా. చాలా కూల్ గా, కామ్ గా ఉంటారు. ధమాకా లాంటి ఘన విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నాలుగేళ్లలో శ్రీనివాస్ గారికి నిర్మాతలు విశ్వప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. కోవిడ్ సమయంలో మా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

తక్కువ సినిమాలు చేయడానికి కారణం?

వచ్చిన ప్రతి సినిమా చేయడంలేదు. నా మనసుకి నచ్చిన సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని నటిస్తున్నాను.

కళ్యాణి మాలిక్ గారి సంగీతం గురించి?

కళ్యాణి మాలిక్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని పాటలు ఉన్నాయి. అందరికీ కనుక చాటు మేఘమా పాట బాగా నచ్చింది. నాకు నీతో సాంగ్ ఇంకా ఎక్కువ నచ్చింది.

కళ్యాణి మాలిక్ గారి సోదరుడు కీరవాణి గారికి ఆస్కార్ గెలుచుకోవడంపై మీ స్పందన?

ఇది చాలా గర్వించదగ్గ విషయం. మన ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు రావడం సంతోషంగా ఉంది.

తదుపరి చిత్రాలు?

అన్నీ మంచి శకునములే, డెవిల్ సినిమాలు చేస్తున్నాను.

More News

Kalvakuntla Kavitha:కవితక్కకు బర్త్ డే విషెస్  : అభిమానం చాటుకున్న బీఆర్ఎస్ నేత.. ఏకంగా సముద్రం అడుగుకి వెళ్లి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్మమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి.

NaatuNaatuOscar:నాటు నాటుకు ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు మోడీ, కేసీఆర్, చంద్రబాబు, జగన్ అభినందనలు

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోతోంది.

Naatu Naatu Song : భారతీయులందరూ గర్వపడేలా చేశారు .. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్‌ రావడంపై చిరు, పవన్ హర్షం

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోతోంది.

Harirama Jogaiah:పవన్‌ను సీఎం చేయాలి, బాబు ఢిల్లీకి పోవాలి.. అలా అయితేనే : జనసేన-టీడీపీ పొత్తుపై హరిరామజోగయ్య వ్యాఖ్యలు

వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి మద్ధతు ప్రకటించారు కాపు సంక్షేమ సేన నేత , మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.

The Elephant Whisperers:మరో భారతీయ చిత్రానికి ఆస్కార్.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’‌కు పురస్కారం

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ చిత్రంలోని నాటు నాటుకు బెస్ట్ ఒరిజినటల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే.