టెక్సాస్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం
- IndiaGlitz, [Tuesday,February 25 2020]
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను దివ్య ఆవుల, రాజా గవిని, ప్రేమ్‌నాథ్ రామనాథంగా గుర్తించారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణం ఎఫ్ఎం 423పై డెల్ వెబ్ బౌలేవార్డ్ జంక్షన్ వద్ద భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రవాస భారతీయులు ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ముగ్గురు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఫ్రిస్కో పోలీసులు గుర్తించారు. కాగా, మృతులు ముగ్గురు కూడా ఫ్రిస్కో పట్టణంలోనే నివసిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మన హైదరాబాద్‌కు చెందిన ముషీరాబాద్ గాంధీనగర్ వాసులు.
దివ్య తండ్రి మాట్లాడుతూ..
ఈ ఘోర ఘటనపై దివ్య తండ్రి స్పందించారు. ‘ ఇవాళ ఉదయం యాక్సిడెంట్ జరిగినట్లుగా సమాచారం వచ్చింది. సాయంత్రం 6:30కు ప్రమాదం జరిగినట్లుగా చెప్పారు. స్కూల్ జోన్ ప్రమాదం జరిగిన ప్రాంతం.. యంగ్ స్టర్స్ కారు నడుపుతున్నట్లుగా చెప్పారు. ఇటీవలే డల్లాస్‌కు మారారు. ఇల్లు కొనేందుకు వెళ్ళారు. తిరిగొస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. నా కూతురు దివ్యతో పాటు అల్లుడు రాజా అతని స్నేహితుడు ప్రేమ్ నాథ్‌లు ఈ ప్రమాదంలో చనిపోయారు. 24 తేదీన ఈరోజు నా కూతురు దివ్య పుట్టిన రోజు పుట్టిన రోజే.. మరణ వార్త వింటామని అనుకోలేదు. రోజూ దివ్య, నా అల్లుడు రాజా ఫోన్‌లో మాట్లాడే వారు.. మాకు అక్కడ తానా వాళ్ళ కూడా సహకారం అందిస్తున్నారు. ఫార్మాల్టీస్ పూర్తి అయిన తరువాత మృతదేహం హైదరాబాద్ కి తీసుకొస్తాం అని చెప్పారు’ అని దివ్య తండ్రి మీడియాకు వెల్లడించారు.