'ఇండియ‌న్ 2' సెట్స్‌లో భారీ ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో బుధవారం అర్ధరాత్రి ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా క్రేన్ తెగిపడి టెంట్‌పై పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రొడక్షన్ అసిస్టెంట్లు ప్రమాద స్థలిలోనే కుప్పకూలారు. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ దర్శకుడు కృష్ణ (34), సహాయకుడు చంద్రన్ (60) ఉన్నారు. మరో పదిమందికి పైగా తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

కమల్, శంకర్ సేఫ్!

అంతేకాదు.. దర్శకుడు శంకర్‌కు గాయాలయ్యాయని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కొద్దిసేపటి తర్వాత టెక్నిషన్ మాత్రమేనని.. మిగిలిన వారంతా సేఫ్‌గానే ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే.. కమల్ హాసన్‌తో పాటు హీరోయిన్లు సేఫ్‌గానే బయటపడ్డారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

లైకా ప్రొడక్షన్స్ స్పందన..

ఈ ఘటనపై లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘ ఈ ప్రమాదం కలిచివేసింది. దీనిపై స్పందించడానికి మాటలు రావట్లేదు. ముగ్గురు మంచి పనితనం ఉన్న టెక్నిషిన్స్‌ను కోల్పోయాం. క్రిష్ణ, చంద్రన్, మధులను కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో లైకా పేర్కొంది.

నా మనసు కలిచివేసింది!

ఈ ఘోర ఘటనపై కమల్‌హాసన్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ ఘటన నా మనసును కలిచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరంగా ఉంది. నా బాధ కన్నా.. కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని కమల్‌హాసన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశారు.