Majili Review
`ఏమాయ చేసావె` సక్సెస్‌తో హిట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య, సమంత జోడి తర్వాత `ఆటోనరగ్ సూర్య`, `మనం` చిత్రాల్లో కూడా నటించారు. రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి చేసిన చిత్రమే `మజిలీ`. ఈ చిత్రంలో భార్యభర్తలుగా నటించడం విశేషం. వ్యక్తుల మధ్య ఉండే ఎమోషన్స్‌ను తెరపై చక్కగా ప్రెజెంట్ చేసి `నిన్నుకోరి` చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `మజిలీ` ఎలా ఉంది? చైతన్య, సమంత జోడి తెరపై ఆకట్టుకుందా? పెళ్లి తర్వాత చై, సామ్ చేసిన ఈ సిమా మెప్పిస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
వైజాగ్‌లో ఉండే పూర్ణ(అక్కినేని నాగచైతన్య)కి క్రికెటర్ కావాలని కోరిక. రైల్వేస్ తరపున ఇండియన్ టీంలోకి సెలక్ట్ కావాలనుకుంటాడు. తండ్రి జగన్నాథమ్(రావు రమేష్) కూడా పర్మిషన్ ఇవ్వడంతో కోచింగ్ కోసం రైల్వేస్ టీం కోచ్ శ్రీనివాస్(రవిప్రకాష్)ను కలిస్తే ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో వైజాగ్‌లోని నేవీ ఆఫీసర్(అతుల్‌కులకర్ణి) కూతురు అన్షు(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ఏరియా యూత్ ప్రెసిడెంట్‌గా ఉండే భూషణ్(సుబ్బరాజ్).. అన్షుపై కన్నేస్తాడు. ఓ రోజు అన్షుపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే పూర్ణ ఆమెను కాపాడుతాడు. అయితే భూషణ్ ఆ సిచ్యువేషన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని పూర్ణ, అన్షులను విడదీస్తాడు. అన్షు నుండి విడిపోయినా కూడా పూర్ణ ఆమె జ్ఞాపకాలతోనే బ్రతుకుతుంటాడు. పూర్ణను ఎదురింట్లో ఉండే శ్రావణి(సమంత అక్కినేని) ఇష్టపడుతుంది. కూతురి కోసం శ్రావణి తండ్రి(పోసాని కృష్ణమురళి).. పూర్ణ అంటే ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఆమెతో కాపురం చేయడు. పూర్ణను అందరూ తిడుతున్నా.. శ్రావణి మాత్రం భర్తకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పూర్ణకు ట్రయినింగ్ ఇచ్చిన రైల్వేస్ కోచ్ శ్రీనివాస్.. డెహ్రాడూన్ ట్రయినింగ్ సెంటర్‌లో కోచ్‌గా ఉంటాడు. ఆయన పిలవడంతో డెహ్రాడూన్ వెళతాడు పూర్ణ. అక్కడ మీరా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇంతకు మీరా ఎవరు? మీరాను పూర్ణ వైజాగ్‌కు ఎందుకు తీసుకెళతాడు? చివరకు పూర్ణ ,శ్రావణి ఎలా కలుసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- బ్యాగ్రౌండ్ స్కోర్
- కెమెరా వర్క్
- ఫస్టాఫ్
- ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త లెంగ్తీగా అనిపించడం
- కొన్ని అనవసరమైన యాక్షన్ సీన్స్ ఉండటం
విశ్లేషణ:
బాధ్యత, ప్రేమ అనే రెండు విషయాలను గురించి చెప్పే చిత్రమే మజిలీ. ప్రేమకథా చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్స్ అయిన అక్కినేని హీరోల్లో ఒకడైన నాగచైతన్య సినిమాలో పూర్ణ అనే పాత్రలో మెప్పించాడు. ప్రేమలో విఫలమై, కెరీర్ పాడైన ఓ కుర్రాడు.. పెళ్లి చేసుకుంటాడు. తాగుబోతుగా మారిన పాత్రలోని విషాదాన్ని చైతన్య చక్కగా నటించాడు. ఫ్టసాఫ్‌లో ఐటిఐ కుర్రాడు, క్రికెటర్ పాత్రలో చైతన్య నటన ఆకట్టుకుంది. ఇక చైతన్య ప్రేయసిగా నటించిన దివ్యాంశ కౌశిక్ పాత్ర తొలి చిత్రమే అయినా మంచి నటనను కనపరిచింది. ఫస్టాఫ్ అంతా క్రికెట్, లవ్ అనే ఎలిమెంట్స్‌తో పాటు సందర్భానుసారం వచ్చే డైలాగ్స్‌తో సినిమా ఆకట్టుకుంటుంది. ఇక సమంత ఎంట్రీ ఇంటర్వెల్‌లో ముందు ఉంటుంది. భర్తను ప్రేమించే భార్య పాత్రలో సమంత జీవించేసిందని చెప్పాలి. శ్రావణి పాత్రలో సమంత అతికినట్లు సరిపోయింది. ఈ మూడు పాత్రలు కాకుండా హీరోయిన్ తండ్రి పాత్రలో పోసాని సింప్లీ సూపర్బ్‌గా చేశాడు. ఇక హీరో తండ్రిగా రావు రమేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొడుకు గురించి బాధపడే తండ్రి పాత్రలో రావు రమేష్ నటన పిల్లర్‌లా నిలిచింది. చైతన్య స్నేహితుడుగా నటించిన నటుడు, సుదర్శన్, రవిప్రకాష్, దివ్యాంశ కౌశిక్ తండ్రి పాత్రలో చేసిన అతుల్‌కులకర్ణి, మీరా పాత్రలో చేసిన అమ్మాయి. విలన్‌గా చేసిన సుబ్బరాజ్, శివలు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు శివ నిర్వాణకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఓ సింపుల్ కథను సన్నివేశాల పరంగా ఎమోషనల్‌గా.. అక్కడక్కడా కామెడీ టచ్ ఉండేలా తెరకెక్కించడం అంటే చిన్న విషయం కాదు. ఎమోషనల్ సీన్స్‌లో తనకెంత పట్టుఉందనే విషయాన్ని శివ నిర్వాణ మరోసారి ప్రూవ్ చేసుకన్నాడు. హీరో క్రికెట్ ఆడుతూ గాయపడినా.. మ్యాచ్ గెలిపించడం.. భార్య భర్తల మధ్య వచ్చే సన్నివేశాలు.. భర్తను సపోర్ట్ చేసే భార్యగా సమంత సన్నివేశాలు.. రావు రమేష్, పోసాని పాత్రలు నాగచైతన్య పాత్రను తిట్టే సన్నివేశాలు ఇవన్నీ ప్రేక్షకులనను మెప్పిస్తాయి. ఇక సాంగ్స్ మాయ మాయ.. ఏడెత్తు మల్లెల.. నాగుండెల్లో... ఇలా సందర్భానుసారం వచ్చే సాంగ్స్ అన్నీ బావున్నాయి. గోపీసుందర్.. మంచి సంగీతాన్ని అందించాడు. ఇక థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బావుంది. నేచురల్ లొకేషన్స్, ఎడిటింగ్ అన్నీ పక్కాగా కుదిరాయి.
బోటమ్ లైన్: ప్రేమ, బాధ్యతల ప్రయాణమే 'మజిలీ'
Read Majili Movie Review in English
- Read in English