Namrata Shirodkar : రమేశ్ బాబు కూతురి గురించి నమ్రత పోస్ట్.. ఎవరైనా ఎమోషనల్ కావాల్సిందే

  • IndiaGlitz, [Wednesday,November 30 2022]

దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ, అభిమానులు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. అయితే అన్నింటికి మించి మహేశ్‌బాబును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఒకే ఏడాది తన సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణను ఆయన కోల్పోయారు. నెలల వ్యవధిలో జరిగిన ఈ విషాదాలతో మహేశ్ బాబు కృంగిపోయారు. అటు ఘట్టమనేని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరి అయ్యింది. ఇప్పుడు కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు, మహేశ్ బాబు, గల్లా జయదేవ్‌లే కుటుంబానికి పెద్ద దిక్కులుగా మారారు. ఇంతటి విషాదంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నారు మహేశ్ సతీమణి నమ్రత.

సినీ తారలను మించిన అందంతో రమేశ్ పిల్లలు:

ఇకపోతే... మహేశ్ బాబు అన్నయ్య రమేశ్ బాబు హీరోగా ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదు. ఏవో కొన్ని సినిమాలు చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. అనంతరం నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కించడంతో పాటు కుటుంబ విషయాలను ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. అయితే రమేశ్ కుటుంబ సభ్యుల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసింది లేదు. కానీ కృష్ణ గారి అంత్యక్రియలు, ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ద కర్మ, తదితర కార్యక్రమాల సందర్భంగా రమేశ్ భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణలు మీడియా కంటికి చిక్కారు. అంతేకాకుండా వారు మహేశ్‌తో కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ బాబుతో కలిసి హీరో కటౌట్‌తో జయకృష్ణ అదనపు ఆకర్షణగా మారారు.

వాళ్ల వల్లే ఇంట్లో నవ్వులు :

తాజాగా .. మహేశ్ సతీమణి నమ్రత తన బావ గారి కుమార్తె భారతితో కలిసున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. భారతి, సితారల గురించి ఆమె చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి అంటూ ఇద్దరితో తాను దిగిన సెల్ఫీని నమ్రత షేర్ చేశారు.