వైద్యులు సూపర్ హీరోలు.. : మహేశ్ బాబు

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

కరోనా మహమ్మారిపై ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులు, వారి బంధువులు, క్వారంటైన్‌లో ఉన్నవారు.. దాడులు చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు కొందరు డాక్టర్లపై ఉమ్మేయడం.. వారిపై తుమ్మడం కూడా చేస్తున్నారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానున్నట్లు కీలక ప్రకటన చేసింది.

నిజంగా వాళ్లు సూపర్ హీరోలు..

తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ‘కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ముందుండి నిలిచి వైద్య సిబ్బంది పోరాడుతోంది. నిజంగా వాళ్లు మన సూపర్ హీరోలు. అలాంటి పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలి. వారికి అపారమైన గౌరవం ఇవ్వాలి. ఇంటివద్దే ఉంటూ సురక్షితంగా ఉండాలి. కరోనాపై తప్పక విజయం సాధిస్తాం’ అని మహేశ్ చెప్పుకొచ్చారు.

దాడి చేస్తే జైలే..

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని.. అంతేకాదు.. నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ రెండింటితో పాటు.. దాడులకు పాల్పడేవారికి లక్ష నుంచి రూ.8లక్షల వరకూ జరిమానా కూడా విధిస్తామని చెప్పారు. ఇవన్నీ అటుంచితే.. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది.