పాన్ ఇండియా మూవీ.. గీతా ఆర్ట్స్‌తో కలిసి మహేశ్ ప్లాన్

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

బాహుబలి ప్రభంజనంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఓవర్సీస్‌లో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ స్టార్స్‌.. తమ మార్కెట్‌ను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టారు. పాన్ ఇండియా సినిమాలు తియ్యాలంటే.. రొటీన్‌కు భిన్నంగా.. మూస కథలకు దూరంగా వెళితేనే.. అది సాధ్యమనే ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ తరహా ఆలోచనల్లో ఉన్నారని తెలుస్తోంది. మంచి స్క్రిప్ట్ దొరికితే.. ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నారట. స్పైడర్ సినిమాలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని.. అలాంటివి మళ్లీ దొరలకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఇందులో భాగంగా ఆయన కొత్త సినీ కథా చర్చలను చాలా జాగ్రత్తగా చేస్తున్నారట. అవసరమైతే నాలుగైదు, నెలలు గ్యాప్ తీసుకుని.. తన ఆహార్యం కూడా మార్చుకోవడానికి సిద్ధమనే సంకేతాలు ఆయన ఇస్తున్నారట. తన ఆలోచనలకు తగ్గట్టు వచ్చే కథలనే ఆయన ఎంపిక చేసే పనిలో ఉన్నారట. తాజాగా ఆయన గీతా ఆర్ట్స్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బన్నీ వాసు ఈ మేరకు చర్చలు జరిపారని తెలుస్తోంది. వచ్చే ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమాను సెట్స్ మీదుకు తీసుకు వెళ్లనున్నారు.

ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. మరో సినిమాకు వెళ్లకుండా.. గ్యాప్ తీసుకోనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వంశీ పైడిపల్లికి మహేశ్ ఓ సినిమా చేస్తానని గతంలో మాటిచ్చారు. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమా తప్ప మరోసినిమాపై ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదు.