వీడియో కాల్‌లోనే అన్నని చివరి చూపు.... దు:ఖం ఆపుకోలేకపోయిన మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇది పెద్ద షాక్‌గా పలువురు అభివర్ణిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో శనివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. రమేష్ మరణవార్తతో కృష్ణ ఫ్యామిలీ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, మహేశ్ అభిమానులు రమేశ్ బాబు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అయితే అన్నయ్యను చివరిసారిగా కూడా చూసుకోలేకపోయారు మహేష్ బాబు. ఆయన కొద్దిరోజుల క్రితం కోవిడ్ బారినపడటంతో ఐసోలేషన్‌లో వుంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారం.. బయటకు రావడానికి వీలు లేదు. దీంతో వీడియో కాల్ ద్వారానే రమేశ్ బాబు భౌతికకాయానికి మహేశ్ నివాళులర్పించారు. కరోనా వల్ల నేరుగా వచ్చి అన్నను కడసారి చూడలేని పరిస్థితుల్లో తనలో తనే కుమిలిపోయారు. మహేశ్ పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు...రమేశ్ బాబు భౌతికకాయాన్ని ఫొటోలు తీసి మహేశ్ కు పంపించారు. వాటిని చూసి మహేశ్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తిరిగి వీడియో కాల్ చేసి అన్నను కడసారి చూసుకున్నాడు. వదిన, పిల్లలకు ధైర్యాన్ని చెప్పారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారి గుండె బరువెక్కింది. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదంటూ వారు కూడా కంటతడి పెట్టారు.
ఆ తర్వాత తనకు అన్నయ్యే సర్వస్వమని.. వచ్చే జన్మలోనూ ఆయనే తనకు అన్నయ్య అని మహేశ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేశ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని అపురూపంగా చూసుకునేవారు రమేష్ . కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చేపట్టారు. ఆ క్రమంలోనే రమేశ్ అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఎలాంటి ఇబ్బంది వున్నా అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు ..అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్‌కి వ్యక్తిగతంగా ఎప్పటికీ తీరని లోటే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments