Mahesh Babu : ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి.. మహేశ్‌ను వెంటాడుతోన్న విషాదాలు
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. అయితే అన్నింటికి మించి మహేశ్‌బాబును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఒకే ఏడాది తన సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణను ఆయన కోల్పోయారు. నెలల వ్యవధిలో జరిగిన ఈ విషాదాలతో మహేశ్ బాబు కృంగిపోయారు.
జనవరిలో అన్న రమేశ్ బాబు కన్నుమూత:
తల్లిదండ్రుల తర్వాత మహేశ్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తి అన్నయ్య రమేశ్ బాబే. కృష్ణ సినిమాలతో బిజీగా వున్న సమయంలో మహేశ్ బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ ఏడాది జనవరి 8న హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దురదృష్టవశాత్తూ అన్న చివరి చూపుకు కూడా మహేశ్ బాబు నోచుకోలేకపోయారు. ఆ సమయంలో మహేశ్ బాబు కోవిడ్ బారినపడటంతో ఐసోలేషన్‌లో వున్నారు. రమేశ్ మరణం మహేశ్‌తో పాటు కృష్ణను కూడా బాగా కృంగదీసింది.
సెప్టెంబర్‌లో దివికేగిన తల్లి ఇందిరా దేవి:
రమేశ్ మరణంతో షాక్‌లో వున్న మహేశ్ బాబును తల్లి ఇందిరా దేవి మరణం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్య సమస్యలతో ఇందిరా దేవి సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అప్పుడు కొడుకుగా తల్లి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు మహేశ్.
తాజాగా తండ్రి మరణం:
విజయ నిర్మల, రమేశ్ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో షాక్‌కు గురైన కృష్ణ ఒంటరితనంతో బాగా కృంగిపోయారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో వున్నారు. అయితే వైద్యులు సీపీఆర్ చేసి కృష్ణను కాపాడారు. నాటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు.
ఒకే ఏడాదిలో సోదరుడిని, తల్లిదండ్రులని కోల్పోతే ఆ బాధ ఎలా వుంటుందో వర్ణించలేనిది. దీంతో ఈ కష్ట సమయంలో మహేశ్‌కు ధైర్యాన్ని ఇవ్వాలని సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments