నాగార్జున బాటలో మహేష్
- IndiaGlitz, [Saturday,April 09 2016]
పరభాష కథానాయకులు మన పరిశ్రమలోనూ మార్కెట్‌ని పెంచుకుంటూ పోతుంటే.. మన హీరోలు మాత్రం చూస్తూ ఊరుకుంటారా? అందుకే.. ద్విభాషా చిత్రాలు చేస్తూ మరో భాషలోనూ పాగా వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కేవలం ద్విభాషా చిత్రం పేరిట మరో భాషలో సినిమాని విడుదల చేసుకోవడం మాత్రమే కాకుండా.. వీలైనంతవరకు తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ అక్కడివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ నాగార్జున.
'ఊపిరి' తమిళ వెర్షన్ 'తోళా'లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి తమిళతంబీలకు మరింత చేరువయ్యాడు నాగ్. ఇప్పుడు ఇదే వరుసలో మహేష్‌బాబు కూడా చేరుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ 'బ్రహ్మోత్సవం' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. తమిళ వెర్షన్ కోసం మహేష్ డబ్బింగ్ చెప్పేందుకు అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే గనుక నాగార్జున బాటలో మహేష్ కూడా పయనించినట్టే. మేలో 'బ్రహ్మోత్సవం' మే 6న విడుదలకు రెడీ అవుతుందని అంటున్నారు.