Krishna Memorial : ఇది కదా నిజమైన నివాళి.. కృష్ణ పేరిట మెమోరియల్, మహేశ్ కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు, నటశేఖర సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 ఏళ్ల పాటు తెలుగు చిత్ర సీమను ఏలిన కృష్ణ ఇక లేరనే వార్తతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనను కడసారి చూసుకునేందుకు తారాలోకంతో పాటు ఆశేష అభిమానులు పద్మాలయా స్టూడియోకు పోటెత్తారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పాటు అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.
కృష్ణ మెమోరియల్‌లో ఏం వుంటాయంటే:
ఈ నేపథ్యంలో తన తండ్రి జ్ఞాపకార్థం సూపర్‌స్టార్ మహేశ్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ జ్ఞాపకార్ధం ఓ మెమోరియల్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మాత్రం కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలు వుంటాయని సమాచారం.
ఏ తెలుగు హీరోకి దక్కని గౌరవం:
ఇదిలావుండగా.. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు కూడా ఇలాంటి మెమోరియల్ లేదు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద ఎన్టీఆర్ గార్డెన్స్ వున్నప్పటికీ.. అక్కడ నటరత్న సమాధి మాత్రమే వుంది. కానీ కృష్ణ మెమోరియల్ మాత్రం భవిష్యత్తులో చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి స్పూర్తిని నింపేలా, సినీ రంగ విశేషాలతో వుండేలా నిర్మించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే నిజంగా కృష్ణకు ఘనమైన నివాళి అర్పించినట్లే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments