కరోనా నివారణకు ప్రభాస్, మహేష్ బాబు విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు, హీరోలు తమకు తోచినంత ఆర్థిక విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అలా కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
మహేష్ బాబు కోటి విరాళం..
తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వంతుగా తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ విరాళాన్ని తెలంగాణ, ఏపీలకు మద్దతుగా నిలిచేందుకు సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా.. మనం ఇప్పుడు చేసే ప్రతి విరాళం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరాళాలు అందించాలని ప్రముఖులు, పెద్దలకు మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఇలా చేస్తే విజయం మనదే..
అంతటితో ఆగని మహేశ్ బాబు.. తన అభిమానులు, యావత్ ప్రజానీకానికి కొన్ని సలహాలు సూచనలు సైతం చేశారు. ‘ఈ కష్టకాలంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమనిబంధనలు పాటించాలి.. ఓ బాధ్యత గల పౌరుడిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకరికి ఒకరం మద్దతుగా నిలిచి మానవాళిని కాపాడుకుందాం. ఈ పోరాటంలో విజయం మనదే... అప్పటివరకు ఇంటికే పరిమితమవుదాం, సురక్షితంగా ఉందాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు చేస్తున్న పోరాటంపై తాను మద్దతిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ స్పష్టం చేశారు.
ప్రభాస్ కోటి విరాళం..
తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా కరోనా నివారణ చర్యల కోసం తెలుగు ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే సాయిధరమ్ తేజ్ కూడా తన వంతు సాయంగా పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఇళ్లకే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా స్టార్స్ అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments