మహర్షి...ఈ మధ్య తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇదొకటి. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటించడం ఒక కారణమైతే, దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి వంటి స్టార్ ప్రొడ్యూసర్స్ సినిమాను నిర్మించడం, వంశీ పైడిపల్లి దర్శకత్వం, కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలా టాప్ టెక్నీషియన్స్ పని చేశారు. సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అదీగాక మహేష్ 25వ చిత్రం. శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత చేస్తోన్న అదే తరహా చిత్రమిది. ఓ చదువుకున్న కుర్రాడు రైతు సమస్యలతో పాటు ఏ అంశాల కోసం పోరాటం చేశాడనేదే కథాంశంగా ప్రచార చిత్రాల్లో కనపడుతుంది. మరి మహేష్ 25వ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించింది? అంచనాలను అందుకుందా? మహేష్ ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ:
అమెరికాలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి రిషికుమార్(మహేష్) సి.ఇ.ఒ అవుతాడు. అతన్ని సర్‌ప్రైజ్ చేయడానికి అతని అసిస్టెంట్(మీనాక్షి దీక్షిత్) సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. అందులో అతని స్నేహితుడు వెన్నెలకిషోర్, లెక్చరర్(రావు రమేష్) సహా కొందరు స్నేహితులు వచ్చి కలుస్తారు. అప్పుడు రిషి తన గతాన్ని నెమరువేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. వైజాగ్‌లో ఎంటెక్ చదివే రోజుల్లో.. రిషి, రవి(అల్లరి నరేష్), పూజ(పూజా హెగ్డే) మంచి స్నేహితులు. తండ్రిని చూసి భయపడి రిషి ఏ విషయంలోనైనా ఓటమి లేకుండా ఎదగాలనుకుంటాడు. అదే రీతిలో అన్నీ సెమిస్టర్స్‌లో టాపర్ అవుతాడు.
రిషి, పూజ మధ్య ప్రేమ పుడుతుంది. అంతా బావుందనుకుంటున్న తరుణంలో ఫైనల్ సెమిస్టర్ ముందు అందరికీ క్యాంపస్ జాబ్స్ వస్తాయి. అయిఏత రిషి చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ను ఆరిజన్ కంపెనీ ఇష్టపడి డీల్ మాట్లాడుకోవాలనుకుంటుంది. రిషి ఉన్నతిని ఇష్టపడని అజయ్(కమల్ కామరాజు) అతను సెమిస్టర్ పేపర్స్ దొంగతనం చేసినట్లు ఆధారాలు క్రియేట్ చేస్తాడు. కాలేజ్ నుండి రిషిని బయటకు పంపేయాలనుకుంటున్న తరుణంలో రవి ఆ నిందను తనపై వేసుకుని రిషిని నిర్దోషిగా బయటకు వచ్చేలా చేస్తాడు. ఆ విషయం ముందు రిషికి తెలియదు. మీటింగ్‌లో లెక్చరర్ ద్వారా విషయం తెలుసుకున్న రిషి... రామావరం వస్తాడు. అక్కడ స్నేహితుడు పరిస్థితిని చూసి తనతో వచ్చేయమంటాడు. అయితే వివేక్ మిట్టల్(జగపతిబాబు) ప్రాజెక్ట్‌కారణంగా తన గ్రామం ఉండదని... కాబట్టి తన గ్రామం కోసం పోరాడుతున్నానని చెబుతాడు రవి. స్నేహితుడికి రిషి అండగా నిలబడతాడు. అప్పటి వరకు రామవరంను పట్టించుకోని మీడియా రిషి అక్కడకు వెళ్లడంతో అటెన్షన్ పెరిగిపోతుంది. వివేక్ మిట్టల్ తన ప్రాజెక్ట్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్లాన్ చేస్తాడు? దానికి ప్రతిగా రిషి ఏం చేస్తాడు? చివరకు రిషి సక్సెస్ సాధించాడా? లేదా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- మహేష్
- కాలేజ్ ఎపిసోడ్స్
- ప్రీ క్లైమాక్స్
- క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్
- సినిమాలో టచ్ చేసిన సామాజిక అంశం
- బ్యాగ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సినిమాలెంగ్త్ ఎక్కువైంది
- సెకండాఫ్‌లో ఫస్ట్ హాఫ్
- పాటలు
- సన్నివేశాలు కొన్ని మహేష్ పాత సినిమాల్లోనే ఉన్నట్లు ఉండటమే
విశ్లేషణ:
మహేష్ మూడు షేడ్స్‌లో అద్భుతంగా నటించాడు. కాలేజ్ సన్నివేశాలు, కంపెనీ సి.ఇ.ఒ తో పాటు రైతుగా కనపడతాడు. మూడు పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాల్లో మహేష్ నటన సింప్లీ సూపర్బ్. సరికొత్తగా తెరపై కనిపించాడు. అలాగే కంపెనీ సి.ఇ.ఒగా స్టైలిష్ లుక్‌లో కనపడ్డాడు. కాలేజ్‌లో మహేష్ క్యారెక్టర్ డిజైనింగ్ బావుంది. అనీష్ కురువిల్లాతో స్టేజ్‌పై సక్సెస్ గురించి మాట్లాడే సన్నివేశం.. అలాగే ముఖేష్ రుషితో కాలేజ్‌లో ఫైట్ సీన్, కాలేజ్‌లో లెక్చరర్ ఇచ్చే ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్ చేసే విధానం, పూజా హెగ్డే తన ఇంటికి మహేష్‌ను పిలిచినప్పుడు జరిగే సన్నివేశం, అల్లరి నరేష్‌కి మహేష్ ధైర్యం చెప్పే సీన్, ఇలా సన్నివేశాలు చక్కగా ఆకట్టుకున్నాయి. ఆయా పాత్రల్లో మహేష్‌తో పాటు అల్లరినరేష్, పూజా హెగ్డే ఇమిడిపోయారు. అలాగే కాలేజ్ పార్టీలో మహేష్ సూపర్‌స్టార్‌కృష్ణ గెటప్ వేయడంకొసమెరుపు అభిమానులకు చాలా బాగా నచ్చతుంది. ఇక తండ్రి ప్రకాష్‌రాజ్ పడే ఇబ్బందులను చూసి ఓటమి అంటే భయపడే సన్నివేశాలు సహా ఎమోషనల్ సీన్స్‌లో మహేష్ అద్భుతంగా నటించాడు. ప్రకాష్‌రాజ్, జయసుధ పాత్రలు ఎమోషనల్ సీన్స్‌లో వెన్నుదన్నుగా నిలిచాయి. ఇక విలన్ పాత్రలో నటించిన జగపతిబాబు చాలా సింపుల్‌గా చేసేశాడు. ఇక సెకండాఫ్‌లో ఫస్ట్ పార్ట్ సీన్స్‌ను లాగినట్లుగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుండి కథలో స్పీడు అందుకుంటుంది. ప్రెస్‌మీట్ సీన్ సూపర్బ్. అలాగే రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమో , మరొకరో కారణం కాదు. మనమే..రైతులకు మనం చూపించాల్సింది జాలి కాదు.. బాధ్యత అనే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్నేహితుడు రవిని విలన్స్ బారి నుండి కాపాడే ఫైట్ సీన్ బావుంది.
దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్టాఫ్‌లో కాలేజ్ సన్నివేశాలతో పాటు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌ను కమర్షియల్‌గా మలిచిన తీరు చాలా బావుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగా లేకున్నా, నేపథ్య సంగీతంఆకట్టుకుంది. కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. పూజా హెగ్డే పాత్రకు పెద్ద స్కోప్ లేదు. పాటలకే పరిమితం అయ్యింది. స్నేహితుల మధ్య గొప్ప ఫ్రెండ్‌షిప్ సన్నివేశాలు లేవు. సినిమా లెంగ్త్ ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలు మహేష్ పాత సినిమాల్లో చూసిన భావనే కలిగింది.
బోటమ్ లైన్: మహర్షి... రైతు ఆవశ్యకతను చెప్పే రిషి ప్రయాణమే
Comments