Mahanubhavudu Review
వరుస హిట్లతో జోరుమీదున్నాడు శర్వానంద్. పండుగ సీజన్‌లను టార్గెట్ చేస్తూ, ఫ్యామిలీలకు కనెక్ట్ అయ్యే కుటుంబ కథా చిత్రాలను ఎంటర్‌టైనింగ్ వేలో చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వ్యక్తిలోని గుణగణాలను టార్గెట్ చేసుకుని, వాటిని కథలుగా అల్లి, వినోదాత్మకంగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు మారుతి. `భలే భలే మగాడివోయ్`లో మతిమరుపు లక్షణాలున్న పాత్రతో ఆకట్టుకున్న మారుతికి `బాబు బంగారం`లో హీరో పాత్రతో చేసిన కరుణ పెద్దగా లాభించలేదు. తాజాగా ఓసీడీ లక్షణాలున్న పాత్రతో `మహానుభావుడు`ను ప్రయత్నించారు. ఈ ప్రయత్నం సఫలమవుతుందా? శర్వానంద్ ఖాతాలో మరో హిట్ చేరుతుందా? ఆలస్యమెందుకు ఇక.. చదివేయండి.
కథ:
ఆనంద్ (శర్వానంద్) సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తుంటాడు. నిద్ర లేవగానే దుప్పటిని చక్కగా మడతబెట్టడం నుంచి, ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం, పళ్లు తోమిన బ్రష్‌ను హెయిర్ డ్రయ్యర్‌తో ఆరబెట్టడం, ఎప్పుడూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండటం, శుభ్రంగా లేదనిపిస్తే తల్లి చేతి గోరు ముద్దలకు కూడా దూరం కావడం అతనికున్న అలవాట్లు. అలాంటి వ్యక్తి తనదైన లక్షణాలున్న మేఘన (మెహ్రీన్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఆరా తీస్తున్న అతనికి.. ఆమె అతని టీమ్‌లోనే జాయిన్ అయిన విషయం తెలిసొస్తుంది. ఓ సారి హాస్పిటల్ ముందు తన ప్రేమను ప్రపోజ్ చేస్తాడు. అయితే అదే హాస్పిటల్ ముందు తన ప్రేమకు దూరం కావాల్సి వస్తుంది. బ్రేకప్ అయిన ప్రేమను బతికించుకోవడానికి మేఘన తండ్రితో కలిసి వాళ్ల ఊరికి ప్రయాణం అవుతాడు. అయితే అక్కడి పరిసరాలకు అలవాటు పడటం అతనికి ఓ టాస్క్ గా మారుతుంది. దానికి మించిన టాస్క్ ఆ ఇంటి పరువును కాపాడాలని ఎదురవుతుంది. ఇంతకీ ఆనంద్ ఏం చేశాడు? అతని ముందున్న రెండు టాస్క్ లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడా? లేదా? అనేది సస్పెన్స్.
ప్లస్ పాయింట్స్:
తెలుగు సినిమాల్లో ఓసీడీ అనే డిసార్డర్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. దర్శకుడు మారుతి ఇలాంటి పాయింట్‌ను కామెడీగా తెరపై చూపించడంలో చక్కగా వర్కవుట్ చేశాడు. సన్నివేశాలను తన అనుకున్న పాయింట్‌ను ప్రెజంట్ చేసేలా సన్నివేశాలను ఎంటర్‌టైనింగ్‌గా రాసుకున్నాడు మారుతి. ఓసీడీతో ఇబ్బంది పడే పాత్రలో శర్వానంద్ నటన చాలా బావుంది. తన నటనతో కామెడీని పుట్టించడంలో శర్వానంద్ సక్సెస్ అయ్యాడు. నజర్ కెమెరా పనితీరు, ఎడిటింగ్ అన్నీ బావున్నాయి. వెన్నెలకిషోర్, నాజర్ సహా సినిమాలో పాత్రలన్నీ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్:
హీరో క్యారక్టరైజేషన్ అనేది కొత్తగా ఉంటుంది తప్ప, కథలో కొత్తదనం ఎక్కడా కనపడదు. హీరో, హీరోయిన్‌ను ప్రేమించడం, ప్రేమ కోసం హీరో, హీరోయిన్ ఊరెళ్లి అక్కడ ఫైట్ చేసి గెలవడం, ప్రేమను గెలుచుకోవడం అనే పాయింట్స్ ఈమధ్య తెలుగులో ఎక్కువగా కనపడుతున్నదే మరి. సెకండాఫ్‌లో ఉన్నంత కామెడీ, ఫస్టాఫ్‌లోకనపడదు. హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ చేయడానికే ఫస్టాఫ్ అంతా సరిపోయింది. కుస్తీలో ఆరితేరిన వ్యక్తిని, అసలు కుస్తీకి సంబంధం లేని వ్యక్తి గెలిచేయడం నమ్మదగ్గ అంశం కాదు. సరే సినిమాటిక్ అనుకునే సరిపుచ్చుకోవాల్సిందే. ఇక థమన్ సంగీతం సో సోగానే ఉందే తప్ప, సినిమాకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు.
సమీక్ష:
నటీనటులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ మధ్య వరుస విజయాలను సాధిస్తున్న శర్వానంద్ మరోసారి డిఫరెంట్‌గా చేసిన పాత్ర ఓసీడీ. పాత్రకు తగ్గ హావభావాలతో, టైమింగ్‌తో కామెడీని జనరేట్ చేయడంలో శర్వా పెద్ద సక్సెస్‌ను సాధించాడు. మారుతి, చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత మోతాడు చెప్పాలో అలా తెరపై ఆవిష్కరించడంలో శర్వా పాత్రనే కీలకంగా మారింది. శర్వా పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మేఘన పాత్రలో మెహరీన్ అందంగా కనపడటమే కాదు, పాత్రకు తగ్గట్టు చక్కగా నటించింది కూడా. ఇక ఊరి పెద్ద పాత్రలో నాజర్ హుందాగా నటించాడు. ఇలాంటి పాత్రలను నాజర్ ఎన్నింటినో చేసి ఉండటం వల్ల తన పాత్రను సునాయసంగా చేసేశారు. ఇక జెమిని సురేష్ రఘుబాబు, వెన్నెలకిషోర్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే, ప్రేమను పొందడానికి, ఇవ్వడానికి అందరూ అర్హులే అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మారుతి చక్కటి కథను రాసుకున్నాడు. కథనం కొత్తదనం లేదు. అయితే మారుతి ఎంచుకున్న ఓసీడి పాయింట్ ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు తెరపై కొత్తదే. హీరో క్యారెక్టరైజేషన్‌ను చక్కగా ఎలివేట్ చేయడం వల్లనే సినిమా పండింది. థమన్ సంగీతం పెద్ద ఎసెట్ కాలేదు. నజర్ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు సినిమాటోగ్రాపర్. ఎడిటింగ్ బావుంది. మొత్తంగా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.
బోటమ్ లైన్: మహానుభావుడు - నవ్విస్తాడు... మెప్పిస్తాడు
Mahanubhavudu Movie Review in English
- Read in English