విశాఖపట్టణంలో ఘనంగా జరిగిన 'మహానటి' విజయభేరి
Send us your feedback to audioarticles@vaarta.com
కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "మహానటి". లెజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకొంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో చిత్ర బృందం "మహానటి" విజయభేరి నిర్వహించింది. చిత్రబృంద సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "అసలు ఈ జనరేషన్ కి "సావిత్రిగారు ఎవరో తెలుసా?" అని అడిగినవాళ్లున్నారు. అలాంటిది సంస్కారవంతంగా ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తే అశేష జనం రెండుమూడుసార్లు చూస్తున్నాం సార్ అని చెబుతుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకదేవుళ్ళకి నా పాదాభివందనాలు.
ఎప్పుడో హీరోగా ఇలా ఊళ్ళు తిరిగాను.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత "మహానటి"లో నేను పోషించిన "కె.వి.చౌదరి" పాత్రకు ఈ విధంగా సక్సెస్ టూర్ చేస్తున్నాను. ఒక సన్నివేశంలో ఎక్కువ, మరో సన్నివేశంలో తక్కువ అన్నట్లు కాకుండా ప్రతి సన్నివేశాన్ని అత్యంత నేర్పుతో తెరకెక్కించిన దర్శకుడు నాగఅశ్విన్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. కీర్తి సురేష్ "మహానటి" పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఇక ఎంతో ధైర్యంతో నిర్మించిన స్వప్న, ప్రియాంకలను మెచ్చుకోవాల్సిందే" అన్నారు.
స్వప్న దత్ మాట్లాడుతూ.. "విశాఖపట్నం ఎంత అందమైన పట్టణమో.. అంతే అందంగా మంచి సినిమాలను ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇది ప్రేక్షకుల విజయం. అడిగిన వెంటనే కాదనకుండా మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ గార్లు అందించిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేము. ఈ అమ్మాయి మన కీర్తి సురేషేనా అనిపించేది సినిమా చూస్తున్నప్పుడల్లా" అన్నారు.
దర్శకుడు నాగఅశ్విన్ మాట్లాడుతూ.. "మహానటి ప్రయాణం మొదలై ఇవాళ్టికి (మే 27) సరిగ్గా సంవత్సరం అయ్యింది. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా స్వప్న, ప్రియాంక ఈ సినిమాను నిర్మించారు. హీరో లేకుండా సినిమా తీస్తున్నారేంటి అని అడిగినవాళ్లందరికీ సినిమా రిజల్ట్ జవాబు ఇచ్చింది.
రాజేంద్రప్రసాద్ గారి పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరు. మా టీం అందరికీ పేరు పేరునా కృతజ్నతలు చెప్పుకొంటున్నాను. ముఖ్యంగా నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, సమంత లాంటి సూపర్ స్టార్స్ అందరూ సావిత్రి గారి మీద అభిమానంతో ఈ సినిమాలో నటించారు" అన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు సావిత్రి గారిలా కనిపించడం కోసం మొదటిసారి మేకప్ వేసుకొన్నాను. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి అఖండ విజయాన్ని అందించారు. నా ప్రొడ్యూసర్స్ స్వప్న, ప్రియాంక, నా డైరెక్టర్ నాగఅశ్విన్ నన్ను ఈ సినిమాలో మహానటిగా నటింపజేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
మా సినిమాటోగ్రాఫర్ డానీ స్పెయిన్ నుంచి వచ్చి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. లీడ్ రోల్ కాకపోయినా ఈ చిత్రంలో నటించిన సమంత గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఆవిడ స్థానంలో నేను ఉంటే ఇలా సెకండ్ లీడ్ లో నటించేదాన్ని కాదేమో. రాజేంద్రప్రసాద్ గార్ని ఇప్పుడు చూస్తుంటే నా తండ్రి భావన కలుగుతోంది" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout