Mahanati Review
కొన్ని సినిమాలు చేయాలంటే సాహసం చేయాలి? కొన్ని సినిమాలు చేయడమే సాహసం? దీంట్లో రెండో రకానికి చెందిన వ్యక్తి డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా తొలి చిత్రం `ఎవడే సుబ్రమణ్యం`ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ తదుపరి మహానటి సావిత్రి బయోపిక్ చేస్తానని ప్రకటించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన మొదటి విషయమేమంటే సావిత్రి గురించి తెలియనివారుండరు. ఆమె జీవితం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె గురించి అందరూ చెప్పిన విషయాలను ఓ సినిమా రూపంలో తీసుకు రావడానికి మాత్రం నాగ్ అశ్విన్ మూడేళ్లు కష్టపడ్డాడు. రెండో విషయమేమంటే.. సావిత్రి మహానటిగా ఎంతో పేరు సంపాదించారు. అగ్ర హీరోలకు ధీటుగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న నటి. ఆమె జీవితాన్ని సినిమాగా తీస్తానంటే అసలు సావిత్రి క్యారెక్టర్ చేయగల నటి ఎవరు? ఏ మాత్రం అనుభవం లేని ఓ దర్శకుడు సావిత్రి జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తాడో? అసలు ఏలా తెరకెక్కిస్తాడో? లాంటి ప్రశ్నలు చాలా మందికి వచ్చాయి. అయితే నటీనటులు, వారి ఫస్ట్ లుక్స్, టీజర్స్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా బాగానే ఉంటుందనే భావన అందరికీ కలిగింది. అసలు నాగ్ అశ్విన్ మహానటిలో ఏం చెప్పాడు? ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం...
కథ:
మహానటి సావిత్రి(కీర్తి సురేశ్) ఆపస్మారక స్థితిలో బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో జాయిన్ అవుతుంది. డాక్టర్స్‌కి తమ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిందెవరో తెలియదు. ఆమెను చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తారు. అప్పటికి డాక్టర్లకు ఆమె సావిత్రి అని తెలుస్తుంది. సావిత్రిని ఆమె భర్త జెమిని గణేశన్(దుల్కర్) తన ఇంట్లో చూసుకుంటూ ఉంటాడు. ఆమె గురించి విషయాలు తెలుసుకోమని ప్రజావాణి ఎడిటర్(తనికెళ్ల భరణి).. మధురవాణి(సమంత)ను పూరమాయిస్తాడు. ఆమెకు సావిత్రి చివరిగా రాసిన ఉత్తరం దొరుకుతుంది. ఆ ఉత్తరంలో శంకరయ్యను కలుసుకోవడానికి బెంగళూరు వచ్చిందని తెలుస్తుంది. అయితే ఆ శంకర్‌ను వెదికే క్రమంలో అసలు సావిత్రి కథ మొదలవుతుంది. విజయవాడలో పుట్టిన సావిత్రికి తండ్రి లేకపోవడంతో ఆమెను పెద్దనాన్న కె.వి.చౌదరి(రాజేంద్ర ప్రసాద్), పెద్దమ్మ(భానుప్రియ) పెంచి పెద్ద చేస్తారు. సావిత్రిని హీరోయిన్‌ను చేసే క్రమంలో మదరాసు చేరుకుంటారు. అక్కడ సావిత్రికి జెమినిగణేశన్ ఫొటోగ్రాఫర్‌గా పరిచయం అవుతాడు. తర్వాత సావిత్రి ఎల్.వి.ప్రసాద్(అవసరాల శ్రీనివాస్) సినిమాతో హీరోయిన్‌గా మారుతుంది. తర్వాత జెమినిగణేశన్ కూడా హీరో అవుతాడు. ఇద్దరూ కలిసి సినిమాలు చేసే క్రమంలో ప్రేమలో పడతారు. అయితే అప్పటికే జెమినీకి పెళ్లై ఉంటుంది. ఆ విషయాన్ని జెమినీ గణేశన్ సావిత్రికి చెబుతాడు. అయినా ప్రేమ గొప్పదని భావించిన సావిత్రి జెమిని గణేశన్‌ను పెళ్లి చేసుకుంటుంది. తర్వాత సావిత్రి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుంది. కోట్లు సంపాదిస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల భరత్తో గొడవ పడుతుంది. అతని నుండి విడిపోయే క్రమంలో తాగుడుకి భానిసై ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది. సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అలా అనుకోకుండా ఆమె కోమాలోకి వెళుతుంది. ఆసలు సావిత్రిని అంతలా కుంగదీసిన పరిస్థితులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ముందుగా అభినందించాలి. సావిత్రిలాంటి మహానటి జీవితాన్ని సినిమాగా తీయాలనుకున్నప్పుడు చాలా ఎమోషన్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా సినిమాను తెరకెక్కించాలి. ప్రేక్షకుడు సినిమాను డాక్యుమెంటరీలా ఎక్కడా ఫీల్ కాకూడదు. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని సంగ్రహించిన అన్ని విషయాలు ఎక్కడా డ్రాప్ కాకుండా ఓ ఫ్లోలో సినిమాగా తెరకెక్కించాడు. పాత్రల మధ్య అనుబంధాలు, ఎమోషన్స్‌ను ఎక్కడా మిస్ కానీయకుండా చూసుకోవడం మరో విశేషం. అందుకే సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకుడు సినిమాకు కాసేపు కనెక్ట్ అయ్యే ఉంటాడు. ఇక టైటిల్ పాత్రలో నటించి కీర్తి సురేశ్ సినిమాకు ప్రధాన ఎసెట్ అయ్యింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. లుక్ పరంగానే కాదు.. నటించేటప్పుడు హావభావాలను చక్కగా పలికించింది. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే జెమినిగణేశన్‌లా దుల్కర్ సల్మాన్, ఎస్.వి.రంగారావులా మోహన్‌బాబు, అక్కినేనిలా నాగచైతన్య, కె.వి.చౌదరిలా రాజేంద్రప్రసాద్, దుర్గమ్మలా భానుప్రియ, సుభద్రమ్మలా దివ్యవాణి, కె.వి.రెడ్డిలా జాగర్లమూడి క్రిష్, సింగీతంలా తరుణ్ భాస్కర్, జెమినిగణేశన్ మొదటి భార్య అలివేలుగా మాళవికానాయర్, సావిత్రి స్నేహితురాలు సుశీలగా షాలిని పాండే, మధురవాణి తల్లిగా తులసి అందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే.. డానీ తన సినిమాటోగ్రఫీతో అద్భుతమైన విజువల్స్ అందించారు. 1940-80 వరకు ఉన్న పరిస్థితులను సినిమాల రూపంలో చూపే క్రమంలో డానీ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఇక మిక్కీ సంగీతం, నేపథ్య సంగీతం మెప్పించింది. ఇక అవినాశ్ ఆర్ట్ వర్క్.. ఓ పీరయడ్ అద్భుతంగా తన వర్క్‌తో చూపించి ఆకట్టుకున్నాడు ఈ కళా దర్శకుడు. సంగీతం, కెమెరా వర్క్, కళాదర్శకత్వం నటీనటుల ప్రతిభకు వెన్నెముకలా నిలిచాయి.
ప్రతిభ ఇంట్లో కూర్చుంటే ప్రపంచ ఒప్పుకోదు .. అన్నం పెట్టేవాడి ఉంగరాలు లాగేసే కాలం ఇది.. వంటి సన్నివేశాల పరంగా వచ్చే సంభాషణలు మెప్పిస్తాయి. సావిత్రి చిన్నపిల్లగా ఉండి నాట్యం నేర్చుకునే సందర్భం.. తన పెద్దనాన్నతో చెన్నై వెళ్లినప్పుడు మా నాన్న అంటుంటే ఆ సందర్భంలో క్రియేట్ అయ్యే కామెడీ.. జెమినీ గణేశన్‌తో ప్రేమ, పెళ్లి వ్యవహారం ఇంట్లో తెలిసినప్పుడు వారితో వాదించే సన్నివేశాలు.. ఇక సావిత్రిగారి దర్పం చూపించే గృహ ప్రవేశ సన్నిశాలు.. అదే సమయంలో అయినవారికి ఆమె అందించిన సహాయ సన్నివేశాలు. భర్తతో గొడవపడే సందర్భాల్లో సావిత్రి మానసిక వ్యథ పడే సన్నివేశాలు.. అలాగే భార్యతో జెమిని గణేశన్ గొడపడే సన్నివేశాలతో పాటు ప్రీ క్లైమాక్స్‌లో ఎస్.వి.రంగారావు(మోహన్‌బాబు)తో వచ్చే సన్నివేశాలు, కారు డ్రైవర్‌కు ఏమీ లేకపోయినా తన చీర అమ్మి సహాయపడే సన్నివేశం ఇలా అన్నీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా మెప్పిస్తాయి. చిన్న చిన్న ఎడిటింగ్ సమస్యలు స్పష్టంగా కనపడ్డాయి. సమంత, విజయ్ దేవరకొండ లవ్ ట్రాక్ ఎక్కువైనట్లు అనిపించింది. అంతే కాకుండా సినిమా సెకండాఫ్‌లో పావిత్రి తన ఇగోల కారణంగానే కష్టాల తెచ్చుకుందని.. జెమినిగణేశన్ మంచి వాడే అన్నట్లు చూపించారు. కొన్ని విషయాలు తప్ప సినిమా ఆసాంతం ఆకట్టుకుంటుంది.
బోటమ్ లైన్: మహానటి.. ఆకట్టుకునే గొప్ప ప్రయత్నం
Mahanati Movie Review in English
- Read in English