Mahabubnagar MLC: కోడ్ ఎఫెక్ట్.. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్ జూన్ 1న ముగియనుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.
కాగా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ మార్చి 28న జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో మొత్తం 1439 ఓటర్లకు గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నాగర్‌కర్నూలు, నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు వేయలేదు. ఇక 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో 99.86 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌లో తన ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోవడం గమనార్హం. 1439 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీటీడీ బోర్డు మాజీ మెంబర్ మన్నె జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్‌గా సుదర్శన్ గౌడ్ పోటీ పడ్డారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని పోలింగ్‌కు ముందు వరకు తమ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ గోవాలో క్యాంప్ రాజకీయాలు చేసింది. అయితే ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అధికార హస్తం పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసింది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో జూన్ 2వ తేదీ వరకు వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout