హీరో ధనుశ్కి మధురై కోర్టు షాక్
- IndiaGlitz, [Saturday,February 29 2020]
తమిళహీరో, రజినీకాంత్ అల్లుడు ధనుశ్ జీవితం ఓ సినిమాను తలపిస్తుంది. ధనుశ్ అసలు తల్లిదండ్రులం తామేనంటూ మధురైకి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు చాలా రోజుల క్రితమే కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ధనుశ్ తమ కొడుకేనని చిన్నప్పుడు తాము మందలించడంతో ఇంటి నుండి వెళ్లిపోయాడంటూ వారు కేసు వేశారు. ఇన్నాళ్లు సాగుతూ వచ్చిన ఈ కేసుపై మధురై కోర్టు ధనుశ్కి షాకిచ్చింది. అదేంటంటే.. జనన, నివాస, విద్యకు సంబంధించిన సర్టిఫికేట్స్ను కోర్టుకు సమర్పించాలంటూ అప్పుడెప్పుడో కోర్టు కోరింది. కానీ ఆ సర్టిఫికేట్స్ ఇంకా ఎందు ఇవ్వలేదంటూ ధనుశ్ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది.
15 రోజుల్లో ధనుశ్ జనన, నివాస, విద్యకి సంబంధించిన సర్టిఫికేట్స్ను సమర్పించాలంటూ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. గతంలో ధనుశ్ తన పుట్టు మచ్చలను చెరిపేయించుకున్నాడనే వాదన కూడా బలంగా వినపడింది. అయితే నటనలో భాగంగానే తాను అలా చేశానని ధనుశ్ క్లారిటీ ఇచ్చుకున్నాడు. అయితే కదిరేశన్, మీనాక్షి దంపతులు డీఎన్ఏ పరీక్షలు చేయాలంటూ.. అప్పుడే అసలు నిజం బయటపడుతుందంటూ కోరుతున్నారు. ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..