నా కుటుంబం అనేది ఎంత కరెక్టో..నా కులం వాడు అనేది కూడా అంతే కరెక్ట్ - మధుర శ్రీధర్ రెడ్డి
- IndiaGlitz, [Tuesday,June 28 2016]
స్నేహగీతం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఇట్స్ మై లవ్ స్టోరీ...తదితర చిత్రాలను అందించిన మధుర శ్రీధర్ రెడ్డి తాజాగా నిర్మించిన చిత్రం ఒక మనసు. ఈ చిత్రంలో నాగ శౌర్య, నిహారిక జంటగా నటించారు. రామరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల రిలీజైన ఒక మనసు అందమైన ప్రేమకథా చిత్రంగా ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా ఒక మనసు చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డితో ఇంటర్ వ్యూ మీకోసం....
ఒక మనసు గురించి మీకు ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి..?
ఫస్టాఫ్ బోర్ గా ఉంది. స్లోగా ఉంది అని అంటున్నారు. అయితే... ప్రతి ఒక్కరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. ఫస్టాఫ్ స్లోగా ఉంది అంటున్నారు కాబట్టి 14 నిమిషాలు ట్రిమ్ చేసాం. ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుండడం ఆనందంగా ఉంది.
ఎడిట్ రూమ్ లో చూసుకున్నప్పుడు మీకు ఫస్టాఫ్ స్లోగా ఉంది అనిపించలేదా..?
ఎడిట్ రూమ్ లో చూసుకున్నప్పుడు స్లోగా ఉంది అనిపించదండి. ఎందుకంటే...మన కంటెంట్ తో ప్రేమలో పడిపోతాం. ఆడియన్స్ తో కూర్చున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేది తెలుస్తుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అర్ధమవ్వడంతో డైరెక్టర్ తో చెప్పి ఎడిట్ చేయించేసాను.
ఒక మనసు మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కదా..ఆడియన్స్ ఎంత వరకు అర్ధం చేసుకున్నారు..?
ఇంతకు ముందు కూడా మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ వచ్చాయి. వాటిని అర్ధం చేసుకున్నారనే కాన్పిడెన్స్ తోనే ఈ చిత్రం చేసాం.
ఒక మనసు చిత్రం పై ఫిల్మ్ క్రిటిక్స్ విమర్శలు చేసారు కదా... క్రిటిక్స్ విమర్శల పై మీరేమంటారు.
ఒక మనసు చిత్రాన్ని కొంత మంది మెచ్చుకున్నారు..కొంత మంది విమర్శించారు. అయినా అందరూ ఏదో కావాలని అన్నట్టు బ్యాడ్ గా రాయలేదు. కొంత మంది బాగుంది అన్నారు. మరి కొంత మంది చాలా బాగుంది అని కూడా అన్నారు. చాలా వెబ్ సైట్స్ లో ఒక మనసు గురించి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఫిల్మ్ మేకింగ్ లో ఇది ఒక పార్ట్ అని నేను ఫీలవుతుంటాను.
ఒక మనసు చిత్రం మీకు సంతృప్తి ఇచ్చిందా..?
నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కొంచెం డీప్ గా అర్ధం చేసుకుంటే ఈసినిమాలో చాలా కోణాలు ఉన్నాయి. నీ మీద ప్రేమ చావదు..ఇంకొంకరి పై ప్రేమ పుట్టదు అనే స్థితిని చాలా మంది పొందుతారు. అలాంటి స్థితిని చాలా బాగా డీల్ చేసారు డైరెక్టర్ రామరాజు. ఇంకొటి ఈ సినిమాలో ఉన్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నాకు బాగా నచ్చింది. ఓవరాల్ గా ఒక మంచి చిత్రం తీసినందుకు చాలా గర్వంగా ఉంది.
ఒక మనసు చూస్తుంటే క్లాసిక్ మూవీ చేయాలని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది నిజమేనా..?
క్లాసిక్ మూవీ అనేవి ట్రై చేస్తే పుట్టవు. మేము ఒక అందమైన ప్రేమకథా చిత్రాన్ని చేయాలనుకున్నాం చేసాం. క్లాసిక్ అవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు. క్లాసిక్ అవ్వాలని చేస్తే అవ్వవు జరగాలంతే.
సి క్లాస్ ఆడియన్ కోసం సినిమా తీయను అన్నారట నిజమేనా..?
నేను..సి క్లాస్ ఆడియన్ కోసం సినిమా తీయను అనలేదు. మనం ఆడియన్స్ ని ఎ, బి, సి అని విభజించి ఎ క్లాస్ ఆడియన్ కి ఇది నచ్చుతుంది బి క్లాస్ ఆడియన్ కి ఇది నచ్చుతుంది అనేది మనం పెట్టుకున్న రూల్స్ అనిపిస్తుంది. సి క్లాస్ ఆడియన్ కి నచ్చాలంటే సెకండాఫ్ మంచి మాస్ సాంగ్ ఉండాలి ఇలాంటి రూల్స్ తో సినిమా మేకింగ్ చేయలేం అనేది నా అభిప్రాయం.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక మనసు చూసి హ్యాపీగా ఫీలయ్యారా..?
నిహారిక ఏక్టింగ్..సినిమా చూసి మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నాగబాబు గారు ఫోన్ చేసి మంచి సినిమా తీసారని అభినందించారు.
మెగా హీరోలందరూ సక్సెస్ అయ్యారు. మరి నిహారిక కూడా సక్సెస్ అయి స్టార్ అవుతుంది అంటారా..?
ఖచ్చితంగా నిహారిక సక్సెస్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిహారిక మల్టీ టాలెంటెడ్. తనలో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి వండర్ ఫుల్ డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కూడా అవుతుంది. మెగా వారసత్వంగా వచ్చిన నటనతో తొలి చిత్రంలోనే చాలా మెచ్యూర్డ్ గా నటించింది. పింక్ ఎలిఫెంట్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ వెబ్ సీరిస్ స్టార్ట్ చేసింది. సో..ఒక పదేళ్ల తర్వాత నిహారిక ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతుంది అనుకుంటున్నాను.
జనరల్ గా హీరో అంటే ఐడియల్ గా ఉంటారు కదా..కానీ ఈ సినిమాలో హీరో ఐడియల్ గా ఉండడు..?
సినిమాలో ఐడియల్ హీరో ఉండాల్సిన అవసరం లేదండి. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో హీరో ఐడియల్ గా ఉండడు. అమ్మాయిలను ఏడిపిస్తుంటాడు. సో... క్యారెక్టర్ ను ఎలా చూపిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ప్రతి హీరో ఐడియల్ గా ఉండాలని లేదండి.
ఒక మనసులో క్యాస్టిజమ్ అనేది ప్రతి చోటా ఉంది అని చూపించారు కదా...మరి సినిమా ఇండస్ట్రీలో ఉందంటారా..?
క్యాస్టిజిమ్ అనేది ప్రతి చోటా ఉంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో తక్కువుగా ఉంటుంది. మన కులం వాడు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ..మన కులం వాడితోనే సినిమా తీసేద్దాం అని ఉండదు. నా కుటుంబం అనేది ఎంత కరెక్టో..నా కులం వాడు అనేది కూడా అంతే కరెక్ట్. అయితే దురాభిమానం ఉండకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్.
రామరాజు గారు ఫస్ట్ ఈ సినిమా కోసం సమంత, రెజీనా ని కూడా అనుకున్నారు. మరి.. నిహారిక ఈ పాత్రకు ఎంత వరకు కరెక్ట్ అంటారు..?
ఖచ్చితంగా ఈ క్యారెక్టర్స్ కి నాగ శౌర్య, నిహారికనే కరెక్ట్. వాళ్లిద్దరు అద్భుతంగా నటించారు.
రియలిస్టిక్ క్లైమాక్స్ పెడితే సినిమా అంతగా ఆడదు కదా..మరి..మీరు క్లైమాక్స్ అలా చూపించడానికి కారణం..?
రియలిస్టిక్ క్లైమాక్స్ పెడితే ఆడదు అని ఎందుకు అనుకుంటారు..? రియలిస్టిక్ క్లైమాక్స్ తో తీసిన సినిమాలు ఎందుకు ఆడలేదు. రియలిస్టిక్ క్లైమాక్స్ తో రామ్ గోపాల్ వర్మ గారు తీయలేదా..? ఆయన అన్ని సినిమాలు అలానే ఉంటాయి కదా..? కథ గమనం ప్రకారం ఏ క్లైమాక్స్ అనిపిస్తే అది చేయాలి. నాకు క్లైమాక్స్ రియలిస్టిక్ గా ఉండాలి అనిపించింది. అందుకే క్లైమాక్స్ అలా చూపించాం.
రామరాజు గారితో మళ్లీ మూవీ చేస్తున్నారని విన్నాం నిజమేనా..?
అవునండి. మళ్లీ రామరాజు గారితో మూవీ చేస్తున్నాను. ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది. త్వరలోనే మేము మరో సినిమా చేయబోతున్నాం. కథగా ఒక లైన్ చెప్పారు బాగా నచ్చింది. స్ర్కిప్ట్ పూర్తయిన తర్వాత కథ డిమాండ్ ను బట్టి కొత్తవాళ్లతోనా...కాదా.. ఎవరితో అనేది ఫైనల్ చేస్తాం.
శ్రీశాంత్ తో సినిమా చేయాలనుకున్నారు కదా..ఈ ప్రాజెక్ట్ ఏమైంది..?
క్రికెట్ బెట్టింగ్ పాయింట్ ఆధారంగా సినిమా చేద్దాం అనుకున్నాను. అయితే...కథలో ఎగ్జైట్ మెంట్ రాకపోయే సరికి ఈ ప్రాజెక్ట్ ఆపేసాం.
మీలో ఉన్న డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ డామినేట్ చేసారా...అందుకే నిర్మాతగా సినిమాలు చేస్తున్నారా..?
అలాంటిదేమి లేదు. దర్శకుడిగా చిన్న బ్రేక్ తీసుకున్నాను అంతే. కథ ఎగ్జైట్ చేస్తే చేద్దామని. అయితే నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు. ఒక సినిమాని తీసి మంచిగా ప్రొమోట్ చేసి..పబ్లిసిటిగా బాగా చేసి థియేటర్ లో రిలీజ్ చేయగలను. త్వరలోనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను.
రీసెంట్ గా ఓ చైల్డ్ ని ఎడాప్ట్ చేసుకున్నారు కదా...?
నేను ఎంతో కొంత సోసైటీకి ఏదైనా చేసే స్ధాయిలో ఉండాలని తపిస్తుంటాను. ఆరోజు ఆ కుర్రాడు కనిపించినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ అది అందుకే ఆ కుర్రాడుని దత్తత తీసుకున్నాను.
మీకు ఇన్ స్పిరేషన్ ఎవరు..?
మా నాన్నగారు. ఇంకొకరు ఇన్ ఫోసెస్ లో వర్క్ చేసినప్పుడు నారాయణ మూర్తి గారు నన్ను బాగా ఇన్ స్పైర్ చేసారు. సోసైటీకి ఏదొకటి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సోసైటీకి ఏదైనా ఇవ్వాలంటే డబ్బు సంపాదించాలి. అందుచేత డబ్బు సంపాదించు సోసైటికి ఏదైనా చెయ్ అని నారాయణమూర్తి గారు చెబుతుండేవారు. ఆ మాటలు నా పై చాలా ప్రభావం చూపించాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం రిస్క్ అనిపించలేదా..?
రిస్క్ అనేది ప్రతి ఫీల్డ్ లో ఉంటుంది. కష్టపడి పని చేస్తూ...మంచి ప్లానింగ్ తో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం.
ఒక మనసు గురించి ఫైనల్ గా ఏం చెబుతారు..?
సోషల్ మీడియాలో చూసాను ప్రేమలో పడ్డవాళ్లు...ప్రేమలో పడాలనుకునే వాళ్లు విపరీతంగా ఒక మనసుని ఇష్టపడతారు అని. చాలా మంది ఇష్టపడ్డారు. ప్రేమలో పడ్డవాళ్లు ఇంకా ఇష్టపడ్డారు. ప్రతి వాళ్లకి లవ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. అది ఒక మనసు చూసినప్పుడు వాళ్ల ప్రేమ గుర్తుకువస్తుంది. సో ఒక మనసు చూడంది మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది.