‘అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. ఇప్పుడేమంటారు జనసైనిక్స్’
- IndiaGlitz, [Thursday,January 23 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలోని కమలనాథులతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. విలీనం చేయాలని కోరగా.. కుదరదని పొత్తుకే పరిమితమని తేల్చిచెప్పి ‘గ్లాస్‌లో కమలం’లాగా ముందుకెళ్లాలని భావించారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు కలిసి కీలక సమావేశం కావడం.. ఢిల్లీలో సైతం మరోసారి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ అండ్ కలమనాథులు సమావేశం కావడం.. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించడం.. వైసీపీని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపై నిశితంగా చర్చించారు. అయితే.. ఈ తరుణంలో బీజేపీ మహిళా నేత, టాలీవుడ్ నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడేమంటారు సైనిక్స్!
వాస్తవానికి మాధవీలత.. పవన్‌కు డై హార్డ్ ఫ్యాన్ అంతేకాదు.. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పింది కూడా. అయితే.. తాజాగా పవన్ బీజేపీతో చేతులు కలిపాక తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. ‘నాకు ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ ఏదో రోజు బీజేపీకి సపోర్ట్ చేస్తారని. బీజేపీ-జనసేన కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ దిస్. లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్. అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. ఇప్పుడేమంటారు జనసైనిక్స్ అప్పట్లో నేను బీజేపీలో చేరానని తిట్టారు కదా.. నేను ఎప్పుడూ రైట్ డెసిషన్ తీసుకుంటా అని నాకు చాలా నమ్మకం. నా బలుపు కూడా అదే ఇప్పుడైనా మీకు అర్ధమౌతోందా?’ అంటూ మాధవీ లత తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు. కాగా.. గత ఎన్నికలకు ముందు ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నోటికొచ్చినట్లుగా కామెంట్స్ చేసిన విషయం విదితమే. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న మాధవీ ఇప్పుడు గట్టిగానే కౌంటరిస్తూ పై విధంగా ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.
భారతీయ ‘జన’తా సేన పార్టీ!
బీజేపీ-జనసేన రెండూ కలిసి పనిచేయాలని నిర్ణయించినప్పుడే రకరకాలుగా పార్టీ పేర్లు, గుర్తులను ఫ్యాన్స్, నెటిజన్లు, విమర్శకులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అయితే తాజాగా మాధవీలత స్పందిస్తూ.. భారతీయ ‘జన’తా సేన పార్టీ’ అంటూ తనదైన స్టైల్లో ఫొటోకు ఫోజులిస్తూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ ఇరువురూ ఈ ఫొటోలో ఉన్నారు.
మొత్తానికి చూస్తే.. పవన్ బీజేపీతో కలిసి పనిచేయడం ఎవరికెంత లాభమో తెలియదు కానీ.. మాధవీలత ఆనందానికి మాత్రం అవధుల్లేకుండాపోయాయ్. మరి గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన మాధవీలత.. రెండు చోట్ల పోటీ చేసిన ఓడిన పవన్ కల్యాణ్ పరిస్థితి మున్ముంథు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.