ఘనంగా 'మదగజరాజ' ఆడియో వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
గతంలో "జిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో అనువదించిన శ్రీ ఓబుళేశ్వరా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తాజా చిత్రం "మదగజరాజ". జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమటం కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. రొక్కం సోమశేఖర్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ మరియు అంజలి హీరోయిన్లుగా నటించారు. విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యంలో రూపొందిన "మదగజరాజ" ఆడియో వేడుక హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు విశాల్, కథానాయికల్లో ఒకరైన వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు సుందర్.సి, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ, ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, జెమిని కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మరియు చిత్ర నిర్మాత తమటం కుమార్ రెడ్డి, సహా నిర్మాత రొక్కం సోమశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.
"మదగజరాజా" ఆడియోను చిత్ర కతానాయకానాయికలైన విశాల్-వరలక్ష్మిలు ఆవిష్కరించగా.. తొలి ప్రతిని దర్శకుడు సుందర్.సి అందుకొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ.. "నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ఇది. కారణాంతరాల వలన విడుదల కొంచెం ఆలశ్యం అయినప్పటికీ.. ప్రెజంట్ ట్రెండ్ కు ఏమాత్రం తగ్గని విధంగా సంభాషణలు, సన్నివేశాలు ఉంటాయి. యాక్షన్ తోపాటు రొమాన్స్, కామెడీ సమపాళ్లలో కలిసీన చిత్రమిది. సుందర్.సి గారు ఈ సినిమాను చిత్రీకరించిన విధానం తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది" అన్నారు.
చిత్ర దర్శకుడు సుందర్.సి మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకూ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకంటే "మదగజరాజా" నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమా గురించి ఎన్ని గంటలు మాట్లాడమన్నా మాట్లాడుతాను. ఈ సినిమాలో విశాల్ తన కామెడీ టైమింగ్ తో, యాక్షన్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడన్న నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.
చిత్ర నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ., "మా "ఓబుళేశ్వరా ప్రొడక్షన్స్" ఇదివరకు తెలుగు ప్రేక్షకులకు అందించిన "జిల్లా" కంటే "మదగజరాజ" పెద్ద విజయం సాధిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించడానికి విశాల్ గారు ఎంతగానో సహకరించారు. అలాగే జెమిని కిరణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తాం" అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. "విశాల్ నాకు సినిమాల్లోకి రాకముందు నుంచి మంచి స్నేహితుడు. అసలు నేను సంగీత దర్శకుడ్ని అవుతానని మొదట చెప్పింది విశాలే. "మదగజరాజా"లో విశాల్ తో ఒక పాట పాడించాను. చాలా అల్లరి పాట అది. ఆ పాట ఈ ఆడియోకి హైలైట్ గా నిలుస్తుంది" అన్నారు.
"మదగజరాజ" చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొంటానన్న పూర్తి నమ్మకం ఉందని, సినిమాలో తన క్యారెక్టర్ ను ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుందని హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది.
ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరైన ఎ.ఎం.రత్నం, జెమిని కిరణ్ మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణలు "మదగజరాజ" చిత్రం ఘన విజయం సాధించి,, చిత్ర నిర్మాత తమటం కుమార్ రెడ్డికి మంచి పేరుతోపాటు భారీ లాభాలు తెచ్చిపెట్టాలని అభిలషించారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout